Nidadavolu Junction: నిడదవోలు స్టేషన్ లో ఆ 3 రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్
Nidadavolu Railway Station | నిడదవోలు స్టేషన్ లో ఆ మూడు రైళ్లను ఆపండి.. అధికారులకు ప్రయాణికుల డిమాండ్

Nidadavolu Junction | నిడదవోలు రైల్వే స్టేషన్ అభివృధి పనుల పరిశీలన కు వచ్చిన విజయవాడ DRM మోహిత్ సోనాకీయా కు అక్కడి ప్రజల నుండి కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ వినిపించాయి. కోట్లు ఖర్చుపెట్టి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయడం బానే ఉంది కానీ ముఖ్యమైన రైలు ఇక్కడ ఆపకపోతే ఎలా అంటూ వారు ప్రశ్నించారు.
ఆ మూడు రైళ్లు ముఖ్యం
హౌరా -చెన్నై, నిడదవోలు -భీమవరం -గుడివాడ లైన్లు కలిసే అతి ముఖ్యమైన జంక్షన్ నిడదవోలు. ఇటీవల కాలంలో ఈ పట్టణం బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఈ స్టేషన్ ని దాదాపు 30 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నారు. రేపు మాపో ఓపెనింగ్ కు సిద్ధమైంది కూడా. ఇంత చేస్తున్నా కొన్ని ముఖ్యమైన రైళ్లు ఇక్కడ ఆగడం లేదు.

జన్మభూమికి హాల్ట్ ఉండాల్సిందే
విశాఖపట్నం -సికింద్రాబాద్ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఈ లైన్ లో చాలా ముఖ్యమైన ట్రైన్. చాలావరకు అన్ రిజర్వుడ్ బోగీల తో నడిచే ట్రైన్ ప్రయాణం చాలా చవక. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఈ రైలు నిడదవోలు స్టేషన్లో ఆగదు. ఉదయం పూట సికింద్రాబాద్ వెళ్లాలనుకుంటే రాజమండ్రి గాని తాడేపల్లిగూడెం గాని వెళ్లి ఈ రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ ని నిడదవోలు చేసిన ఆపాల్సిందిగా ఎప్పటినుంచో డిమాండ్ ఉంది.
17221 కాకినాడ -LTT ని ఆపండి
రాజమండ్రి తర్వాత మార్వాడీలు ఎక్కువగా ఉండేది నిడదవోలు పట్టణంలోనే. ఇక్కడ బంగారం వ్యాపారం చాలా ప్రసిద్ధి. నిడదవోలు నుంచి ముంబైకి వెళ్లాలంటే ప్రస్తుతం కోణార్క్ ఎక్స్ప్రెస్ ఒక్కటే దిక్కు. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ లో టిక్కెట్ దొరకడం అంత సులభం కాదు. కానీ 17221 నెంబర్ తో ప్రతీ బుధ,శనివారాల్లో కాకినాడ-LTT ఎక్స్ ప్రెస్ ఈ రూట్లో వెళుతుంది. దగ్గరలోని కాకినాడ నుంచి బయలుదేరుతుంది కాబట్టి ఈ రైలు ఖాళీగానే ఉంటుంది. కానీ నిడదవోలు స్టేషన్లో దీనికి హార్ట్ లేదు. రాజమండ్రి గాని తాడేపల్లిగూడెం గానీ వెళ్లాల్సిందే. అందుకే ఈ ట్రైన్ కి నిడదవోలు స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాల్సిందే అని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ కి ట్రైన్ లేదు..
గోదావరి జిల్లాలో రాజకీయంగా చాలా ముఖ్యమైన ప్రాంతం నిడదవోలు. ప్రస్తుత రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అక్కడ నుంచే ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఒకప్పుడు నిడదవోలు నుంచి ఢిల్లీ కి లింక్ ఎక్స్ ప్రెస్ ఉండేది. విశాఖపట్నం- కాజీపేట మధ్య నడిచే ఈ రైలు కాజీపేటలో దక్షిణ ఎక్స్ప్రెస్ తో లింక్ అయ్యేది. దానితో నిడదవోలు నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లే సౌకర్యం ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎక్స్ప్రెస్ ను ప్రకటించడంతో లింక్ ఎక్స్ ప్రెస్ ను విశాఖపట్నం- మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ గా మార్చేశారు.
ప్రస్తుతం రూట్లో 12803 విశాఖపట్నం- హజరత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్, 20805 విశాఖపట్నం -న్యూ ఢిల్లీ AP ఎక్స్ ప్రెస్ నడుస్తున్నాయి. కానీ రెండు రైళ్ళ కూ నిడదవోలు లో స్టాప్ లేదు. వీటిలో కనీసం ఒక రైలు నిడదవోలు స్టేషన్ లో ఆగితే ఈ ఏరియా నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్న డిమాండ్ డిఆర్ఎమ్ ముందు వినిపించారు నిడదవోలు ప్రజలు. కోట్లు ఖర్చుపెట్టి డెవలప్ చేసి, అదనంగా మరో రెండు ప్లాట్ఫామ్ లు ఏర్పాటు చేసి ముఖ్యమైన రైళ్ళకి హాల్ట్ కల్పించక పోతే ఎలా అనేది వాళ్ళ డిమాండ్. మరి దీనిపై రైల్వే అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.





















