Pralhad Joshi: కేంద్రం ఓ నీచమైన ప్రభుత్వమన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫైర్
Pralhad Joshi: కేంద్రం ఒక నీచమైన ప్రభుత్వమని, మానవత్వం లేదన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
Pralhad Joshi: కేంద్రంలో ఉన్నది నీచమైన ప్రభుత్వం అని, మానవత్వం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు వ్యతిరేకంగా బీజేపీ కేంద్ర సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కర్ణాటకకు బియ్యం సరఫరా చేయకపోవడంపై మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై సీఎం సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అత్యున్నత పదవిలో ఉండటం పట్ల కాంగ్రెస్ అసూయ పడుతోందని అన్నారు. గాంధీ కుటుంబానికి ప్రధాని కూర్చీపై సర్వ హక్కులు ఉన్నాయని భావిస్తోందని విమర్శించారు. సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన మోదీని నీచ్ అని పిలవడానికి ప్రయత్నించాయని అన్నారు. మోదీ పేద నేపథ్యం నుంచి వచ్చి దేశ అత్యున్నత పదవి చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను చూసి అసూయపడుతోందని చెప్పారు. ప్రధానమంత్రి పదవిపై తమకే అన్ని హక్కులు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోందని, పీఎం కుర్చీ గాంధీ కుటుంబానికి చెందినదేనని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సదర్భంగా ఇచ్చిన ఐదు కీలకమైన హామీల్లో అన్నభాగ్య పథకం కూడా ఒకటి. ఈ హామీ ప్రకారం.. ప్రతి బీపీఎల్ (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు) ఖాతాదారులకు 5 కిలోల చొప్పున అదనంగా బియ్యాన్ని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది. అన్నభాగ్య పథకాన్ని అమలు చేసేందుకు అదనంగా ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. కానీ బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలో తమకు బియ్యం ఇవ్వాల్సింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు బియ్యాన్ని సరఫరా చేయడానికి నిరాకరించిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
అన్నభాగ్య పథకం కింద లబ్ధిదారులైన పేదలకు అదనంగా 5 కిలోల చొప్పున సరఫరా చేయాలనే తమ విన్నపాన్ని అంగీకరించలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 7 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 - 5 కిలోలకు కుదించిందని విమర్శించారు. దాని వల్లే ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అదనంగా ఇస్తామని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు సిద్ధరామయ్య. పంపిణీ చేసేందుకు బియ్యం కోసం కేంద్రాన్ని సంప్రదించగా.. బియ్యం ఇవ్వలేదని అన్నారు. కేంద్రం నుంచి తామేమీ ఉచితంగా బియ్యం అడగడం లేదని, డబ్బు చెల్లిస్తామని అంటున్నా కేంద్రం ఇవ్వడం లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నీచమైనదని, మానవత్వం లేనిదని కామెంట్ చేశారు.
బియ్యం ఇవ్వడంలేదంటూ కేంద్రంపై సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. దేశం మొత్తం కరువు పరిస్థితులు ఉన్నాయని, బియ్యం నిల్వలు క్షీణిస్తున్నందు వల్ల ఎగుమతులను కూడా నిషేధించినట్లు వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అడిగినా.. కేంద్రం బియ్యం ఇవ్వడంలేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. నీచ్ అనే పదాలు వాడటం.. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.