Union Cabinet Meet: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం - ఇక కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌లో తొలి బిల్లు ఇదే
పార్లమెంటు సమావేశాలను పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనానికి తరలించేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలైన రోజే నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సాయంత్రం 6:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాగా, రెండు గంటలకు పైగా సాగింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టసభల్లో (పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు) మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలు కలుగుతుంది. దీంతో రేపు (సెప్టెంబరు 19) కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాల్లో తొలి బిల్లుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లునే ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంటు సమావేశాలను పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనానికి తరలించేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది. అంతేకాక, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని సమావేశాలకు ముందు ప్రధాని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందే వీరితో మోదీ భేటీ
సోమవారం (సెప్టెంబర్ 18) కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంత్రులతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి క్యాబిన్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.