Thiruvananthapuram Mayor: చంటి బిడ్డతో ఆఫీస్‌కు తిరువనంతపురం మేయర్, సోషల్ మీడియాలో వైరల్
Thiruvananthapuram Mayor: భారతదేశ మహిళల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నేల నుంచి నింగి వరకు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Thiruvananthapuram Mayor: భారతదేశ ఆడపడుచుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీధుల్లో ఊడ్చే స్వీపర్ నుంచి రాష్ట్రపతి వరకు, నేల నుంచి నింగి వరకు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ఇతర దేశాల మహిళలతో పోటీ పడుతూ, అన్ని విధాలుగా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగం బాధ్యతలు, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఉదయం పనులకు వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చాక పనులు చేసుకుని నిరంతరం శ్రమిస్తుంటారు. అయితే కొన్ని సార్లు కొందరు ప్రముఖులు చేసే పనులు చర్చనీయాంశంగా వైరల్‌గా మారతాయి.
దేశంలోనే అతి పిన్న వయస్కురాలిగా జాతీయ దృష్టిని ఆకర్షించిన తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నెల రోజుల పాపతో కార్యాలయంలో పని చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడం చర్చకు దారితీసింది. ఆర్య రాజేంద్రన్ అతి పిన్న వయసులోనే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికై యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 2020లో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె వయసు 21 సంవత్సరాలే.
కొద్ది రోజులకు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను ఆర్య రాజేంద్రన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆగస్టు 10వ తేదీన ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. ప్రసవం జరిగి నెల దాటిందో లేదో.. ఆర్య రాజేంద్రన్ తన పాపను ఎత్తుకొని కార్యాలయానికి వెళ్లారు. తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఇటు వ్యక్తిగతంగా అటు వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు.
మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ మరికొందరు స్పందించారు. పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్‌ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు ఇంకొందరు. పని చేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా? అంటూ మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్ అని మరికొంత మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. సాధారణంగా రోజువారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మేయర్ ఆర్య రాజేంద్రన్ తీరు ప్రశంసలతోపాటు, విమర్శలను కారణమైంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ ఫొటో విమర్శకులు కేవలం ప్రచార స్టంట్ అంటూ విమర్శించారు. రోజువారీ వేతన కార్మికులు కూడా తమ పిల్లలను తీసుకునే పనికి వెళ్తారని, తమ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారని, అందులో ఏం ప్రత్యేకత ఉందని ప్రశ్నిస్తున్నారు. ఏనాడైనా సాధారణ మహిళ గురించి మాట్లాడారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీధుల్లో ఊడ్చే పారిశుద్ధ్య కార్మికురాలు, పనికి వెళ్లే మహిళ కూడా పిల్లలను ఒడిలో పెటుకొని పని చేస్తారని, ఇప్పుడు ఆర్యన్ రాజేంద్ర సైతం ఇదే విధంగా పని చేస్తున్నారని అంటున్నారు. ఒక తల్లి బిడ్డను చూసుకోవడంలో గొప్ప విషయం ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read: కొత్త పార్లమెంట్ భవనానికి పేరు ఖరారు, ఇంతకీ ఆ పేరు ఏంటంటే?
Also Read: తెలుగు రాష్ట్రాలపై మహిళా రిజర్వేషన్ బిల్లు ఎఫెక్ట్, అన్ని సీట్లు కేటాయించాల్సిందేనా?