Tamil Nadu: తమిళనాడులోకి సీబీఐకి నో ఎంట్రీ! సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
Tamil Nadu Withdraws General Consent For CBI: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు తమ సాధారణ అనుమతిని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది.
Tamil Nadu Withdraws General Consent For CBI
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు తమ సాధారణ అనుమతిని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇస్తేనే సీబీఐ రాష్ట్రంలోకి రావాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దాంతో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల బాటలో తమిళనాడు నడుస్తున్నట్లు అయింది. తమిళనాడు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఏదైనా దర్యాప్తు చేయడానికి ముందు సీబీఐ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షపార్టీల నేతల్ని ఇబ్బందులకు గురిచేసేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. అందువల్లే తాము రాష్ట్రంలో సీబీఐ విచారణకు రావాలంటే సాధారణ అనుమతిని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులపై తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరింపులకు గురిచేయడానికి ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను ఉసిగోల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాఖ్య వ్యవస్థకు ఇది పూర్తి విరుద్ధమని, రాష్ట్రాల డెవలప్ మెంట్ కు సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై నిఘా సంస్థలతో దాడి చేయించడం సరికాదన్నారు.
ప్రాంతీయ పార్టీలను రాజకీయంగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో అలాంటి నేతలను బెదిరించేందుకు బీజేపీ చేసే ప్రయత్నాలు ఫలించవు అన్నారు. కేంద్రం ఇప్పటికైనా ఈ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. చెన్నైలోని మంత్రి బాలాజీ నివాసంతో పాటు డీఎంకే నేత స్వస్థలమైన కరూర్‌లో ED దాడులు చేసింది. ఈరోడ్ జిల్లాలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) లారీ కాంట్రాక్టర్ ఇంట్లో సైతం ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేయడాన్ని డీఎంకే నేతలు తప్పుపడుతున్నారు.
జనరల్ కన్సెంట్‌తో పని లేకుండా కోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు !
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు ఇందుకు ఎప్పటికప్పుడు సమ్మతి నోటిఫికేషన్‌లు ఇస్తుంటాయి. సమ్మతి నోటిఫికేషన్ ప్రకారం... ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ తనిఖీలు, దర్యాప్తులు చేయవచ్చు. సీబీఐకి సాధారణ మద్దతు ఉపసంహరించుకున్న రాష్ట్రాలు అన్నీ బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నవే. కేంద్ర ప్రభుత్వ సంస్థలో అవినీతి జరిగిందని సమాచారం అందితే... కేసు గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిపై సీబీఐ కేసులు నమోదు చేయాలంటే ప్రతి కేసుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. అయితే, రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడం ఆపలేరు. కోర్టులు ఆదేశిస్తే... దర్యాప్తు చేయవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు.