Candidates Criminal Record: నేతల నేర చరిత్ర 48 గంటల్లోగా ప్రకటించండి.. రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు ఇచ్చింది. దాన్ని తాజాగా సవరించింది.
దేశంలోని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు మంగళవారం (ఆగస్టు 10) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగానే.. 48 గంటల్లోగా వారికి సంబంధించిన నేర చరిత్ర లేదా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను బయటపెట్టాలని ఆదేశించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల పరిధుల్లో జరిగే ఏ ఎన్నిక విషయంలోనైనా ఈ నిబంధన పాటించాలని సూచించింది.
అభ్యర్థి నేర చరిత్రకు సంబంధించి అభియోగాల వివరాలతో పాటు, కేసు నెంబరు వంటి వివరాలను ప్రకటించాల్సి ఉంటుందని ధర్మాసనం సూచించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గోవైలతో కూడిన ధర్మాసనం.. గతంలో సుప్రీం ఈ అంశంపై ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. ఫిబ్రవరి 2020లో కూడా సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పు ఇచ్చింది.
అయితే, ఆ తీర్పులోని 4.4 పేరాగ్రాఫ్‌లో అప్పట్లో కొన్ని నిబంధనలు నిర్దేశించింది. రాజకీయ పార్టీ అభ్యర్థి వివరాలను ప్రకటించాక, 48 గంటల్లోపు ప్రకటించాలని లేదా నామినేషన్ తేదీకి రెండు వారాల ముందే ఆ నేరచరిత్రను బహిర్గతం చేయాలని సూచించింది. తాజాగా ఆ పేరాలోని వివరాలను సవరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గత తీర్పులోని 4.4 పేరాలో ఉన్న పాయింట్‌ను సవరించిన ప్రకారం.. ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా ఏదైనా ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే ఎన్నికల కోసం అభ్యర్థి పేరును ప్రకటించగానే.. సదరు రాజకీయ పార్టీ ఆయనకు సంబంధించిన వివరాలను కూడా బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
అంతేకాక, ఆ నేర చరిత్ర ఉన్న అభ్యర్థిని ఎన్నికల్లోనిలబెట్టేందుకు ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో కూడా రాజకీయ పార్టీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఆదేశించింది. అయితే, ఇలా చేయని రాజకీయ పార్టీల గుర్తులను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం ఆదేశాలు పాటించని పార్టీలకు కోర్టు ధిక్కరణ నోటీసులివ్వాలని కూడా కోరాయి. ఈ క్రమంలో కోర్టు తాజా తీర్పు వెలువరించింది. మరోవైపు, కోర్టు ఆదేశాలు పాటించని రాజకీయ పార్టీల గుర్తులు కూడా నిలిపివేస్తామని ఈసీ కోర్టుకు తెలిపింది.
Also Read: RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా.. గాంధీ ఆస్పత్రిలో చేరిన మాజీ ఐపీఎస్