Supreme Court: 'బుల్డోజర్ న్యాయం'పై సుప్రీంకోర్టు కీలక తీర్పు - అప్పటివరకూ కొంపలేం మునిగిపోవంటూ వ్యాఖ్యలు
Buldozer Justice: దేశవ్యాప్తంగా బుల్డోజర్లతో నేరగాళ్ల ఇళ్లు, ఆస్తుల కూల్చివేతలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 'బుల్డోజర్ న్యాయం'ను తక్షణమే ఆపాలని ఆదేశించింది.
Supreme Court Verdict On Buldozer Justice: దేశవ్యాప్తంగా 'బుల్డోజర్ న్యాయం'పై (Buldozer Justice) సుప్రీంకోర్టు (Suprme Court) మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. నేరగాళ్లకు సంబంధించి అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేసే ప్రక్రియకు అక్టోబర్ 1 వరకూ బ్రేక్ వేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులపైకి బుల్డోజర్లను నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడం, మార్గదర్శకాలపై విచారణ చేపట్టింది. జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని బెంచ్.. అనధికారికంగా జరిపే ఇలాంటి బుల్డోజర్ చర్యలను అక్టోబర్ 1 వరకూ నిలిపేయాలని పేర్కొంది. ఈ విధానాన్ని చాలా గొప్పగా చిత్రీకరించే తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. మరోవైపు, వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతుందన్న ప్రభుత్వ భయాలను కొట్టిపారేసింది. 'వచ్చే విచారణ తేదీ వరకూ మీ చర్యలను ఆపాలని మేం కోరినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు.' అని జస్టిస్ బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెలలో వివిధ రాష్ట్రాలు రెండుసార్లు చేపట్టిన 'బుల్డోజర్ న్యాయం'పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వీటికి ఆదేశాలు వర్తించవు
అదే సమయంలో బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు విషయంలో ఈ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 'బుల్డోజర్ న్యాయం'ను హీరోయిజంగా చూపే యత్నం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘానికి సైతం నోటీసులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈసీకి నోటీసులు ఇస్తామనడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కేసులో ప్రధాన పిటిషనర్‌గా జామత్ ఉలేమా హింద్ వ్యవహరిస్తోంది. కూల్చివేతలకు ముందు కనీసం 40 - 60 రోజుల ముందుగా నోటీసులు జారీ చేయాలని.. చట్ట వ్యతిరేక కూల్చివేతలకు సదరు అధికారులను బాధ్యులను చేయాలని సుప్రీంకు నివేదించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, సీయూ సింగ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన వాదనల్లో దేశంలో ఎక్కడా ఈ తరహా చర్యల్లో మార్గదర్శకాలను పాటించడం లేదని పేర్కొన్నారు. అటు, యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం 'బుల్డోజర్ న్యాయం'పై అక్టోబర్ 1 వరకూ స్టే విధించింది.