M Karunanidhi: తమిళనాడు సీఎంకు సుప్రీం కోర్టులో ఊరట-మెరినా బీచ్‌లో కరుణానిధి స్మారక చిహ్నం పెన్ నిర్మాణానికి అనుమతి
M Karunanidhi: చెన్నై మెరీనా బీచ్‌లో నిర్మించనున్న కరుణానిధి స్మారక మండపానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
M Karunanidhi: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చెన్నై మెరీనా బీచ్‌లో దివంగత డీఎంకే అధినేత కరుణానిధి స్మారక చిహ్నం నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కలైంజ్ఞర్‌కు గౌరవంగా 134 అడుగుల ఎత్తున్న పెన్ స్మారకాన్ని నిర్మించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని అడ్డుకుంటూ మత్స్యకారుల పక్షాన నల్లతంబి, మాజీ మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్‌షు ధూలియాతో కూడిన ధర్మాసనం న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు లేదా, పర్యావరణ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించుకోవాలని పిటిషనర్‌కు న్యాయమూర్తులు సూచించారు.
పర్యావరణ ఆందోళనలు, మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని స్మారక మండపం నిర్మాణాన్ని నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసే విధంగా స్మారక కట్టడాన్ని నిర్మించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తమిళనాడు ప్రభుత్వం, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ నల్లతంబి, జయకుమార్ కోర్టుకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపాదిత స్మారక నిర్మాణానికి అనుమతి ఇచ్చాయని పిటిషనర్లు ఆరోపించారు.
సముద్ర తీరంలో అనియంత్రిత నిర్మాణాలతో బ్యాక్ వాటర్ సహజ మార్గంలోకి అక్రమంగా చొరబడుతోందని, దీని ఫలితమే తమిళనాడులో ఇటీవలి సంవత్సరాలలో ఎదుర్కొన్న వినాశకరమైన వరదలు అన్నారు. 80 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ స్మారక మండపం తీరప్రాంతాన్ని మరింత ప్రభావితం చేస్తుందని, మెరీనా బీచ్ అధిక విస్తీర్ణం కలిగిన ప్రాంతం కాబట్టి చేపలపై ప్రభావం చూపుతుందని వాదించారు.
పిటిషన్లను వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదనలు వినిపించారు. పిటిషన్ ఎటువంటి అర్హతలు లేనిదని, స్మారకానికి తీరప్రాంత నియంత్రణ క్లియరెన్స్ లభించిందని వాదించారు. ప్రతిపాదిత స్మారకం మత్స్యకారులకు ఎలాంటి బాధను కలిగించదని, ఆలివ్ తాబేళ్లపై ప్రతికూల ప్రభావం చూపదని విల్సన్ బెంచ్‌కి వివరించారు. మాజీ మంత్రి జయకుమార్ చేసిన అభ్యర్థన రాజకీయ ప్రేరేపితమైనదని, పిటిషన్‌లో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేనిది విల్సన్ ధర్మాసనానికి వివరించారు.
2018లో అప్పటి AIADMK ప్రభుత్వం కలైంజ్ఞర్‌కు అంత్యక్రియలకు 6 అడుగుల స్థలాన్ని నిరాకరించిందని, ఇప్పుడు సైతం రాజకీయ కుట్రలతో పెన్ మెమోరియల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం నల్లతంబి, మాజీ మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్ పిటిషన్‌కు విచారణార్హత లేదని కొట్టివేసింది. కరుణానిధి స్మారక మండపం నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఇదీ నేపథ్యం
చెన్నై మెరీనాబీచ్‌లో కరుణానిధి సమాధివద్ద 2.2 ఎకరాల విస్తీర్ణంలో స్మారకమండపాన్ని నిర్మించాలని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు అసెంబ్లీలో సైతం తీర్మనం చేశారు. దీనిపై ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి, ఉపనేత ఓ పన్నీర్‌సెల్వం, విపక్షాల సభ్యులు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ, పత్రిక, సినీ, సాహిత్యరంగాల్లో విశేషఖ్యాతి గడించిన కరుణానిధికి స్మారకమండపం నిర్మించడం సరైన గౌరవమని కొనియాడారు. ఇందులో భాగంగా కరుణానిధి సమాధి నుంచి అద్దాల వంతెన నిర్మించి సముద్రం మధ్యలో ఈ పెన్ను నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ నిర్మాణ పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ, పర్యాటకంతోపాటు, సముద్ర తీర బోర్డు అనుమతులు దక్కాయి. అయితే సామాజిక వేత్త నల్లతంబి, మాజీ మత్స్యశాఖ మంత్రి జయకుమార్ స్మారక మందిరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు.