Vande Bharat Trains: రైళ్లు ఎక్కడ ఆగాలో కూడా మేం చెప్పాలా? పిటిషనర్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court on Vande Bharat: రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలో రైల్వే శాఖ నిర్ణయిస్తుందని, ఫలానా చోట ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది.
Supreme Court on Vande Bharat: వందే భారత్ రైలు తిరూరు స్టాపింగ్‌లో ఆపాలని కేరళకు చెందిన న్యాయవాది పీటీ శిజిష్ వేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రైళ్లకు ఎక్కడ స్టాపింగ్ ఇవ్వాలో తాము ఆదేశించలేమని వ్యాఖ్యానించింది. రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలో రైల్వే శాఖ నిర్ణయిస్తుందని, ఫలానా చోట ఆపాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదని వెల్లడించింది. ఈ విషయంపై తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ ను కొట్టివేసింది.
అసలు ఏం జరిగిందంటే?
కేరళలోని మలప్పురం జిల్లా తిరూర్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలు నిలిపేలా దక్షిణ రైల్వేకు ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ట్రానికి చెందిన న్యాయవాది పీటీ శిజిష్ ఆ హైకోర్టును ఆశ్రయించారు. తొలుత తిరూర్‌లో వందే భారత్‌ను ఆపాలని నిర్ణయించారని అయితే రాజకీయ కారణాలతో రైల్వే శాఖ ఆ నిర్ణయాన్ని మార్చుకుందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణార్హం కాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో శిజిష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ హక్కు ఎవరికీ లేదు
సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. ఇలాంటి అభ్యర్థనతో అత్యున్నత న్యాయస్థానానికి రావడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలని తేల్చి చెప్పింది. ‘వందేభారత్ రైలు ఏ స్టేషన్‌లో ఆగాలనేది నిర్ణయించాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు. ఆ తర్వాత డిల్లీ-ముంబై రాజధాని ట్రైన్ స్టాప్ ఎక్కడుండాలో కూడా మమ్మల్ని షెడ్యూల్ చేయమంటారా? రైళ్లు ఎక్కడెక్కడ ఆగాలనేది రైల్వే శాఖ నిర్ణయిస్తుంది. రైలు ఫలానా స్టేషన్ దగ్గర ఆగాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదు’ అంటూ వ్యాఖ్యానించింది.
ఎక్స్‌ప్రెస్ పదానికి అర్థమే ఉండదు
‘వందే భారత్ లాంటి హైస్పీడ్ రైళ్ల స్టాపింగులను డిమాండ్ల ప్రాతిపదికన నిర్ణయించడం సరికాదు. ప్రతి జిల్లాలో నుంచి ఓ వ్యక్తి తమకు నచ్చిన రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఉండాలని డిమాండ్ చేయడం ప్రారంభిస్తే.. హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు ప్రయోజనం లేకుండా పోతుంది. ఎక్స్‌ప్రెస్ రైలు అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఇలాంటివి మేం ప్రభుత్వానికి చెప్పలేం. ఇది విధానపరమైన అంశం. అధికారుల దగ్గరకు వెళ్లండి’’ అంటూ పిటిషన్‌ను సుప్రింకోర్టు కొట్టివేసింది. కనీసం తన పిటిషన్‌ను పరిశీలించేలా ప్రభుత్వానికి సూచించాలని పిటిషనర్ అభ్యర్థించగా.. ధర్మాసనం అందుకు తిరస్కరించింది. తాము ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
వందేభారత్ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్
ఏప్రిల్ 25న తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. మెరుగైన, అత్యాధునిక వసతులు ఉండడంతో వందే భారత్ రైలుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో తమకు సమీపంలోని పెద్ద స్టేషన్లలో స్టాపింగ్ కల్పించాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తిరువనంతపురం నుంచి కానూరు మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. మొత్తం కేరళ రాష్ట్రంలో 501 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 11 జిల్లాల్లో ప్రయాణిస్తుండగా కేవలం 6 స్టాపింగులు మాత్రమే ఉన్నాయి. ఈ ట్రైన్‌కు 16 కోచ్‌లు ఉంటాయి. ఈ ట్రైన్‌పై మే నెలలో రాళ్లదాడి జరిగింది.