Re issue of Passport: పాస్‌పోర్ట్ గడువు ముగిసిందా? పేజీలు అయిపోయాయా? రీఇష్యూ కోసం ఇలా అప్లై చేయండి!
పాస్‌పోర్ట్ గడువు ముగిసిన క్రమంలో మళ్లీ పాస్‌పోర్ట్ పొందేందుకు చాలా మంది హైరానా పడుతుంటారు.. పేరు, చిరునామా వివరాలు మారిన వారు ఎలా మార్చుకోవాలో కంగారుపడుతుంటారు..

Re issue of Passport List of Documents Required | ఒకప్పుడు విదేశాలకు వెళ్లేవారు సంఖ్య చాలా తక్కువ.. కానీ గత కొన్నేళ్లుగా ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది.. విదేశాలకు వెళ్లేవారిలో కూడా చాలా మంది ఏడాదికి ఒకసారో లేక రెండుసార్లు మాత్రమే వెళ్లే పరిస్థితి ఉండేది.. కొందరైతే అదికూడా ఉండదు.. కానీ పెరుగుతోన్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగ, వ్యాపారం, వైద్యం కోసమే కాకుండా టూరిజం కోసం కూడా విదేశాలు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.. అయితే దేశం దాటాలంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా జారీ అయ్యే పాస్‌పోర్ట్ తప్పనిసరి.
చాలా మంది అవగాహన లేక పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడం మర్చిపోతుంటారు.. ఒక వేళ చేయించుకున్నా అందులో మార్పులు(అప్‌డేట్స్) ఏమైనా ఉంటే మార్చించుకోకుండా అలానే మళ్లీ అప్లై చేస్తుంటారు.. తాజా నిబంధనల ప్రకారం మనం సమర్పించే దృవీకరణ పత్రాల్లో ఏమాత్రం తేడా ఉన్నా అవి రిజెక్ట్ అవుతాయి.. దీంతో కొంత సమయం, డబ్బు వృధా అయ్యే పరిస్థితి లేకపోలేదు.. అందుకే పాస్‌పోర్ట్ గడువు పూర్తయినా లేక పేజీలు పూర్తయినా ఈజాగ్రత్తలు తీసుకుని దరఖాస్తు చేసుకుంటే పాస్‌పోర్ట్ రీ ఇష్యూ ప్రక్రియ చాలా సునాయాసంగా జరిగిపోతుంది.. తక్కువ సమయంలోనే పాస్‌పోర్ట్ మన చేతిలో ఉంటుంది..
దరఖాస్తుకు ముందు వీటిని సరిచూసుకోండి..
పాస్‌పోర్ట్ రీ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి తప్పనిసరిగా మన పాస్‌పోర్ట్ ను, మనం సమర్పించే దృవీకరణ పత్రాలను సరిచూసుకోవాలి. తాజా నిబంధనల ప్రకారం మన ఆధార్ కార్డులో చిన్న స్పెల్లింగ్ మిస్టిక్ ఉన్నా ఆధార్‌ను సరిచేసుకుని(అప్‌డేట్) రమ్మనే పరిస్థితి ఉంటుంది. పాస్‌పోర్ట్‌లో ఉన్న స్పెల్లింగ్ ఆధార్ కార్డులో లేకపోయి ఆధార్ ప్రకారమే మనకు పాస్‌పోర్ట్ రీ ఇష్యూ కావాల్సి ఉన్నట్లయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలోనే చేంచ్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాస్‌పోర్ట్ డీటైల్స్ అనే చోట క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆధార్ ప్రకారం పాస్‌పోర్ట్ రీ ఇష్యూ చేస్తారు. లేదా పాస్‌పోర్టులోఉన్న ప్రకారం ఆధార్‌లో లేకపోయి పాస్‌పోర్ట్‌లోఉన్న విధంగానే రీ ఇష్యూ కావాల్సియుంటే ఆధార్ అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
డేట్‌ఆఫ్ బర్త్ విషయంలో ఒక్కసారి పాస్‌పోర్ట్‌లో నమోదైన ప్రకారంగానే రీ ఇష్యూ చేస్తారు. అలా గనుక ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే పాస్‌పోర్ట్ ఆధారంగా ఆధార్ అప్‌డేట్‌చేయించుకోవాల్సిఉంటుంది. ఇక అప్లికెంట్ వివాహితులైతే భర్త లేదా భార్య పేరు యాడ్ చేసుకోవచ్చు.. దీనికి మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందులోనూ స్పెల్లింగ్ మిస్టిక్స్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. చేంచ్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాస్‌పోర్ట్ డీటైల్స్ అనే ఆప్షన్‌లో వ్యక్తిగత వివరాలు మార్పు, వైవాహిక స్థితి మార్పు(సింగిల్ నుంచి మ్యారేజ్ లేదా డివోర్స్), చిరునామా మార్పు, ఈసీఆర్ నుంచి ఈసీఎన్‌ఆర్ మార్పు, 36 పేజీల నుంచి 60 పేజీల పాస్‌పోర్ట్ మార్పు సందర్భంగా ఈ ఆప్షన్ కీలకంగా ఉపయోగపడుతుంది.
ఫీజుల్లో మార్పు ఉంటుందా...
పాస్ పోర్ట్ రీ ఇష్యూ కోసం 30 పేజీల పాస్‌పోర్ట్ సాధారణ దరఖాస్తు కోసం రూ.1500, 60 పేజీల పాస్‌పోర్ట్ కోసం అయితే రూ.2,000 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అదే తత్కాల్‌లో అయితే 30 పేజీల పాస్‌పోర్ట్ కోసం రూ.3,500, 60 పేజీల పాస్‌పోర్ట్ కొరకు రూ.4,000 చెల్లించాలి. పాస్‌పోర్ట్ నిర్ణీత గడువు ముగిసి ఎన్నేళ్లు అయినా, గడువు పూర్తికాకుండా దరఖాస్తు చేసుకున్నా ఫీజుల్లో ఎటువంటి మార్పు లేదు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.. పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్ ([www.passportindia.gov.in](http://www.passportindia.gov.in))లోకి వెళ్ళండి.
- "New User Registration" ఆప్షన్ ఎంచుకుని ఖాతా సృష్టించండి లేదా ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వండి.
2. అప్లికేషన్ ఫారం నింపండి..
- "Apply for Fresh Passport/Re-issue of Passport" ఎంచుకోండి.
- రీ-ఇష్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసి, అవసరమైన వివరాలు (పేరు, పుట్టిన తేదీ, పాత పాస్‌పోర్ట్ నంబర్ మొదలైనవి) నింపండి. సరిచూసుకున్నాక అన్నీ కరెక్ట్‌గా ఉంటే సబ్మిట్ చేయండి. ఒక్కసారి సబ్మిట్ చేస్తే మరళా సరిచేయడానికి వీలు ఉండదు..
3. ఫీజు చెల్లింపు, అపాయింట్‌మెంట్ స్లాట్ బుకింగ్..
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి ముందు మీకు కావాల్సిన లేదా దగ్గర్లో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.. అదే సమయంలో అందుబాటులో ఉన్న మనకు కావాల్సిన డేట్‌ను ఎంపిక చేసుకోవాలి.. అనంతరం యూపీఐ ద్వరా కానీ, నెట్ బ్యాంకింగ్, లేదా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వరా (సాధారణ పాస్‌పోర్ట్‌కు ₹1,500, తత్కాల్‌కు ₹3,500 సుమారు) చెల్లించాలి. మీరు ఎంపిక చేసుకున్న డేట్‌లో అపాయింట్‌మెంట్ స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. ప్రింట్ రిసిప్ట్ అప్లికేషన్‌పై క్లిక్ చేసి ఫ్రింట్ తీసుకోవచ్చు..
5. సేవా కేంద్రానికి ఒరిజినల్ డాక్యుమెంట్లతో వెళ్లండి..
నిర్ణీత తేదీన PSKకి వెళ్ళి, డాక్యుమెంట్లు సబ్మిట్ చేయండి. పాత పాస్‌పోర్ట్ (ఒరిజినల్ & కాపీ),
గుర్తింపు పత్రం (ఆధార్ కార్డ్, వోటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్), అవసరాన్ని బట్టి మ్యారేజ్ సర్టిఫికెట్, విద్యా అహర్హత సర్టిఫికెట్లు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది..





















