అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్ గాంధీ, సాయంత్రం లోక్ సభ సెక్రటేరియట్ కు తాళాలు అందజేత
12 తుగ్లక్ లేన్ బంగ్లాలో దాదాపు రెండు దశాబ్దాలుగా రాహుల్ గాంధీ ఉంటున్నారు. ఇవాళ ఆ ఇంటిని ఖాళీ చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం (ఏప్రిల్ 21) తన అధికారిక నివాసం 12 తుగ్లక్ లేన్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాహుల్ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ నేత శనివారం లోక్ సభ సెక్రటేరియట్ కు ఇంటి తాళాలు అందజేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన రాహుల్ గాంధీకి గత నెలలో పార్లమెంటు సభ్యత్వం కూడా పోయింది. దీంతో ఈ బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు అధికారులు తల్లి సోనియాగాంధీ అధికారిక నివాసం దాస్ జనపథ్లో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. గత కొన్ని రోజులుగా రాహుల్ ఉపయోగించే సామగ్రిని దాస్ జన్ పథ్ కు తరలిస్తున్నారు.
ఏప్రిల్ 14న రాహుల్ గాంధీ తన కార్యాలయాన్ని, కొన్ని వ్యక్తిగత వస్తువులను బంగ్లా నుంచి తీసుకెళ్లిపోయారు. శుక్రవారం సాయంత్రం బంగ్లాలో మిగిలిపోయిన వస్తువులను రాహుల్ గాంధీ తీసుకెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎంపీ హోదాలో ఆయనకు బంగ్లా కేటాయించారు. తమ వస్తువులతో ఓ ట్రక్కు భవనం నుంచి వెళ్లిపోవడం కనిపించింది.
రాహుల్ గాంధీ తన కార్యాలయానికి స్థలాన్ని వెతుకుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'మోదీ ఇంటిపేరు'కు సంబంధించిన కేసులో ఈ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఎంపీ పదవిపై కూడా అనర్హత వేటు పడింది. అందుకే ఏప్రిల్ 22లోగా ఈ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు వచ్చాయి.
మార్చి 23న సూరత్ కోర్టు పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన ఎంపీ పదవికి అనర్హుడయ్యారు. సూరత్ సెషన్స్ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగిలింది.
సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై వచ్చే వారం గుజరాత్ హైకోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. అనర్హత వేటు పడిన మరుసటి రోజే ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది. 2004లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో వయనాడ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.