PRO-Khalistani Twitter Account: భారతదేశంలోని ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
PRO-Khalistani Twitter Account: భారతదేశంలోని ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేశారు. ఇందులో న్యూ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కెనడా నాయకుడు జగ్మీత్ సింగ్ ట్విట్టర్ ఖాతా కూడా ఉంది.
PRO-Khalistani Twitter Account: భారతదేశంలోని ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలను సోమవారం అంటే మార్చి 21వ తేదీన బ్లాక్ చేశారు. ఈ బ్లాక్ చేయబడిన ఖాతాల్లో న్యూ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కెనడా నాయకుడు జగ్మీత్ సింగ్ ట్విట్టర్ ఖాతా కూడా ఉంది. వాస్తవానికి ఖలిస్తానీ నాయకుడు అమృత్ పాల్ సింగ్‌పై పోలీసు చర్యకు వ్యతిరేకంగా నిరసనలు రావడంతో ఖాతాలను బ్లాక్ చేశారు. విదేశాల్లోని భారతీయ కాన్సులేట్‌లు మరియు హైకమిషన్‌లపై ఖలిస్తానీ శక్తులు దాడి చేసి ధ్వంసం చేస్తున్న తరుణంలో ఈ చర్య జరిగింది. కెనడా కవయిత్రి రూపి కౌర్, కార్యకర్త గురుదీప్ సింగ్ సహోటా ట్విట్టర్ ఖాతాలు కూడా బ్లాక్ చేశారు. జగ్మీత్ సింగ్ భారతదేశ వ్యతిరేక వ్యాఖ్యలకు ప్రసిద్ధి చెందాడు. కాబట్టి అతని ఖాతాను కూడా అధికారులు బ్లాక్ చేశారు.
ఖలిస్థానీ మద్దతుదారుల దాడులపై తీవ్రంగా స్పందించిన భారత్
మార్చి 19వ తేదీ ఆదివారం రోజు ఖలిస్తానీ మద్దతుదారులు లండన్‌లోని భారత హైకమిషన్‌పై దాడి చేశారు. అలాగే త్రివర్ణ పతాకాన్ని తీసివేశారు. అదే సమయంలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్తానీ మూకలు దాడి చేశాయి. ఈ ఘటనల తర్వాత భారత్ ఇలాంటి దాడుల వార్తలపై తీవ్రంగా స్పందించింది.
శాన్ ఫ్రాన్సిస్కో, భార్టేలో జరిగిన విధ్వంస ఘటనపై...
లండన్‌లో జరిగిన ఘటనకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఏ) సీనియర్ బ్రిటిష్ దౌత్యవేత్తను పిలిపించింది. అదే సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలో విధ్వంసం జరిగిన తర్వాత ఢిల్లీలో యూఎస్ ఛార్జ్ డి'అఫైర్స్‌తో జరిగిన సమావేశంలో భారతదేశం తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. దీనిపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఈ సంఘటనను ఖండిస్తూ.. తాము భారతదేశ దౌత్యవేత్తలు, వారి భద్రతకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు.
దేశం విడిచి పారిపోయే ప్రయత్నాల్లో అమృత్‌పాల్ సింగ్
ఖనిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ దేశాన్ని విడిచి పారిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అమృత్‌పాల్ సింగ్ నేపాల్ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారిస్ పంజాబ్ దే నేత కోసం భద్రతా దళాలు పంజాబ్ ను గాలిస్తున్నాయి. చాలా కాలం దుబాయ్ లో ఉన్న అమృత్‌పాల్ కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పరిచయాలు ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. అతడిని పాక్ ఐఎస్ఐ పావుగా వాడుకుంటోందని, పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి అమృత్‌పాల్ ను వాడుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు
అమృత్‌పాల్ 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు దుబాయ్ కు వెళ్లాడు. అక్కడే ఖలిస్థానీ నాయకుడు లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జశ్వంత్ తో, ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. వారు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత అమృత్‌పాల్‌ను జార్జియా పంపించారు. అక్కడే అతడికి ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
పంజాబ్ లో ఆందోళనలు రేపడానికే అమృత్ పాల్ దేశంలోకి అడుగుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వారిస్ పంజాబ్ దేలో చేరి చాలా వేగంగా ఎదిగాడు. దీంతో పాటు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా అమృత్ పాల్‌కు సంబంధాలు ఉన్నాయి. పాక్ నుంచి తరచూ డ్రోన్ల ద్వారా పంజాబ్ లో ఉన్న అమృత్ పాల్ కు అవసరమైన ఆయుధాలు సమకూరినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అమృత్ పాల్ కు యూకేలో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా ప్రధాన హ్యాండిలర్ గా వ్యవహరించినట్లు గుర్తించారు. అవతార్ సింగ్, పమ్మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 2022 ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్ పాల్ మెరుపువేగంలో ఎదుగుదల వెనక అవతార్ ప్లాన్లు ఉన్నాయి. గతంలో అమృత్ పాల్ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. కానీ దీప్ సిద్దూ మరణం తర్వాత వారిస్ పంజాబ్ దేకు అన్నీ తానైపోయాడు.