Bihar Election Result 2025: బిహార్ ఎన్నికల్లో ప్రభుత్వం 14000 కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు వాడేసింది.. జన సురాజ్ పార్టీ ఆరోపణలు
బిహార్ ఎన్నికలకు ముందు ఎన్డీఏ మహిళలకు ఇచ్చిన ₹10,000 ప్రపంచ బ్యాంకు నిధులు మళ్లించిందని జన సూరాజ్ ప్రతినిధి పవన్ వర్మ ఆరోపించారు.

Bihar Poll Result 2025 | పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సురాజ్ జీర్ణించుకోలేకపోతోంది. అధికారంలో ఉన్న ఎన్డీఏపై తీవ్ర ఆరోపణలు చేసింది. జన సురాజ్ పార్టీ ప్రతినిధి పవన్ వర్మ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ బ్యాంకు నిధులే బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాయని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో నడుస్తున్న ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను ఎన్డీయే ప్రభుత్వం దారి మళ్లించి, ప్రచార సమయంలో మహిళా ఓటర్లకు బదిలీ చేయడానికి ఉపయోగించిందని పవన్ వర్మ ఆరోపించారు.
మరో ప్రాజెక్టుకు నిధులు మళ్లించారని ఆరోపణ
జన సురాజ్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ వర్మ ప్రకారం.. బిహార్ ఎన్నికలకు ముందు మహిళా రోజ్‌గార్ యోజన కింద దాదాపు 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో సీఎం నితీష్ కుమార్ ₹10,000 జమ చేశారు. ఓటర్లు ఎన్డీఏకు మద్దతు ఇవ్వకపోతే మిగిలిన వాయిదాలను నిలిపివేస్తారని ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ మొత్తం నగదు ప్రపంచ బ్యాంకు నుండి వచ్చిన ₹21,000 కోట్ల నిధి నుంచి తీసుకుని ఎన్నికల కోసం ఖర్చు చేశారని వర్మ పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ నియమావళి ప్రారంభానికి ఒక గంట ముందు ₹14,000 కోట్లను రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు.
అదే సమయంలో, ఈ ఆరోపణపై ప్రభుత్వం స్పందించి వాస్తవాలు బయటపెట్టాలన్నారు. మాకు అందిన సమాచారం తప్పు అయితే, తాను క్షమాపణ కోరుతానని స్పష్టం చేశారు. కానీ ఇది నిజమైతే, ఇది ఎంత అనైతికం అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వాలు తరచుగా నిధుల విడుదల, ఖర్చులను సమర్థిస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది
రాష్ట్రంపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని కూడా పవన్ వర్మ ఎత్తి చూపారు. బిహార్ ప్రభుత్వ తీసుకున్న రుణం ₹4,06,000 కోట్లుగా ఉందని, రోజువారీ వడ్డీ చెల్లింపులు ₹63 కోట్లు అన్నారు. అందుకే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 4 కోట్ల మంది మహిళల్లో 2.5 కోట్లకు హామీ ఇచ్చిన మొత్తం అందలేదని జన సురాజ్ ప్రతినిధి అన్నారు. ఎన్డీఏ తిరిగి ఎన్నిక కాకపోతే ప్రయోజనాలు ఆగిపోతాయనే మహిళల్లో ఆందోళన రేకెత్తించి ఓట్లుగా మలుచుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల తీరు, ఫలితాలపై అనుమానాలు
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన వంటి సంక్షేమ పథకాలు ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా మారాయా అనే అంశంపై స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ "ఉచితాలపై" గతంలో చేసిన విమర్శలను వర్మ ప్రస్తావించారు. ఢిల్లీ అసెంబ్లీ, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ఉచితాలు సరికాదని, ఇలాంటివి చేయకూదన్నారు. ఇప్పుడు బీహార్‌లో ఏమైంది?, ఆ వ్యాఖ్యలకు మోదీ ఎందుకు కట్టుబడి లేరని ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే మద్యంపై నిషేధాన్ని ఎత్తివేస్తానని వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన హామీతో జన సురాజ్ పార్టీ ఓటమి ముడిపడి ఉందన్న వ్యాఖ్యలను పవన్ వర్మ తోసిపుచ్చారు. మద్యం ఇప్పటికే అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం ఏ విధంగా ఇంట్లో ఉండే మహిళలను ప్రభావితం చేస్తుందని ప్రశ్నించారు.






















