PM Modi Bengaluru Metro: బెంగళూరు మెట్రో యెల్లో లైన్, 3 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
Vande Bharat Train | బెంగళూరు నగరంలో మెట్రో యెల్లో లైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను సైతం ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

PM Modi Launches three Vande Bharat train | బెంగళూరు: భారత ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్ లో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఇందులో బెంగళూరు - బెలగావి మధ్య నడిచే వందే భారత్, అమృత్సర్ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాతో పాటు నాగ్‌పూర్ (అజ్ని) - పూణే మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ప్రధాని మోదీ ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ RV రోడ్ (రాగిగుడ్డ) నుంచి బొమ్మసంద్ర వరకు యెల్లో లైన్ మెట్రో, ఇది 19 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవుతో పాటు 16 స్టేషన్లను కలిగి ఉంది. దాదాపు 7,160 కోట్ల రూపాయలతో నిర్మించారు.
బెంగళూరుతో 96 కిలోమీటర్లకు చేరిన మెట్రో లైన్
ఈ యెల్లో లైన్ (Bengaluru Metro Yellow Line) ప్రారంభంతో బెంగళూరులో ప్రస్తుతం ఉన్న మెట్రో నెట్‌వర్క్ పొడవు 96 కిలోమీటర్లకు పెరిగింది. ఇది ఈ ప్రాంతంలోని రద్దీ జనాభాకు సేవలు అందిస్తుంది. ప్రధాని మోదీ ప్రారంభించిన బెంగళూరు ఎల్లో లైన్ హోసూర్ రోడ్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీ జంక్షన్ వంటి రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.
LIVE : PM Shri @narendramodi flags-off yellow line of Bengaluru Metro and takes a Metro ride. https://t.co/NNuE2kLUXm
— BJP (@BJP4India) August 10, 2025
బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్ శంకుస్థాపన
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు స్వయంగా శంకుస్థాపన చేశారు. ఆరెంజ్ లైన్ అని దీనికి నామకరణం చేశారు. బెంగళూరు మెట్రో ఫేజ్-3 నిర్మాణం సుమారు 15,611 కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 44 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 31 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ బెంగళూరు నగరంలో పెరుగుతున్న జనాభా, రవాణా అవసరాలను తీరుస్తుందని అంచనా వేశారు. నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలతో పాటు విద్యా సంబంధిత అవసరాలను తీరుస్తుంది. బెంగళూరు ఫేజ్-3లో రెండు కారిడార్లు లేదా లైన్లు ఉంటాయి. ఇందులో JP నగర్ 4వ ఫేజ్ నుంచి కెంపపురా (32.15 కిలోమీటర్లు), హోసహళ్లి నుంచి కదబాగెరె (12.5 కిలోమీటర్లు) లైన్లు ఉన్నాయి.
HAL విమానాశ్రయానికి వెళ్లిన మోదీ
షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (IIT) బెంగళూరును సందర్శించారు ఇక్కడ ఆయన బెంగళూరు మెట్రో ఫేజ్-3కి శంకుస్థాపన చేశారు. నగరంలోని RV రోడ్ (రాగిగుడ్డ) నుంచి బొమ్మసంద్ర మెట్రో స్టేషన్ వరకు నడిచే యెల్లో లైన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఆ తరువాత అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా HAL విమానాశ్రయానికి వెళ్లి అటు నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం అయ్యారు.






















