Modi Trump Tariff:ట్రంప్ పేరు ప్రస్తావించకుండా అమెరికాకు ప్రధాని సమాధానం- రైతు ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదని కామెంట్
Modi Trump Tariff: భారత్‌పై సుంకాన్ని ట్రంప్ 25% నుంచి 50%కి పెంచారు. దీనిపై నేరుగా ప్రధాని మోదీ స్పందించకపోయినా పరోక్షంగా మాట్లాడారు.

Modi Trump Tariff: భారత్ -అమెరికా సంబంధాలు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్ రగిలిపోతోంది. బయటకు అంత ఘాటుగా స్పందించకపోయినప్పటికీ లోలోపల చాలానే కోపం చాలానే ఉందని అర్థమవుతోంది. భారత్పై టారిఫ్ను మొదట పాతిక శాతంతో మొదలు పెట్టిన ట్రంప్ దాన్ని ఇప్పుడు 50 శాతానికి తీసుకెళ్లారు.
దీనిపై సోషల్ మీడియా వేదికలపై మాత్రమే స్పందిస్తున్న భారత్ ప్రభుత్వం నేరుగా ఎక్కడా బహిరంగ వేదికలపై స్పందించడం లేదు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. ట్రంప్ పేరును ప్రస్తావించకుండా రియాక్ట్ అయ్యారు. రైతులే తమకు మొదటి ప్రధాన్యత అని ప్రధాన మంత్రి మోదీ గురువారం (ఆగస్టు 7)న అన్నారు. రైతుల సమస్యలపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
వాస్తవానికి, భారతదేశ హరిత విప్లవం పితామహుడు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ 100వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, "మా రైతులకు సంబంధించిన ప్రయోజనాలకు మేము అత్యధిక ప్రాధాన్యతనిస్తాము. భారతదేశం తన రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీపడదు." అని అన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు - ప్రధాని మోదీ
ప్రధాని మోదీ మాట్లాడుతూ, "రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దీని కోసం నేను మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకు తెలుసు. రైతులు, పశుపోషకుల సంక్షేమం కోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. వారి ప్రయోజనాల విషయంలో రాజీపడబోము. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయంపై ఖర్చు తగ్గించడం, ఆదాయానికి కొత్త మార్గాలు అన్వేషించడం వంటి లక్ష్యాలపై మేము నిరంతరం పని చేస్తున్నాం. మా ప్రభుత్వం రైతుల శక్తిని దేశ పురోగతికి ప్రధాన వనరుగా భావించింది."
ట్రంప్ భారతదేశంపై సుంకాన్ని ఎందుకు పెంచారు?
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇది ఇంకా ఖరారు కాలేదు. అమెరికా వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోంది. ఒత్తిడి కూడా చేస్తోంది, కాని భారత్ దీనికి సిద్ధంగా లేదు. ఇప్పుడు అమెరికా రష్యా పేరుతో సుంకాన్ని పెంచింది. రష్యా నుంచి భారత్ చమురు కొనడం ట్రంప్‌కు నచ్చలేదు. ట్రంప్ దీనిపై అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. ట్రంప్ మొదట సుంకాన్ని పెంచుతామని బెదిరించారు.ఇప్పుడు బుధవారం (ఆగస్టు 6)న ఈ మేరకు సంతకం చేశారు.
India will never compromise on the interests of its farmers. pic.twitter.com/WExdyvkLRU
— PMO India (@PMOIndia) August 7, 2025



















