Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ప్రధానికి ఆహ్వానం
Ayodhya Ram Temple: యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
Ayodhya Ram Temple: యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. రామమందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని వేడుకల్లో స్వయంగా పాల్గొనేందుకు అంగీకరించారు.
जय सियाराम!
— Narendra Modi (@narendramodi) October 25, 2023
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn
ప్రధాని మోదీతో సమావేశం అనంతరం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ మీడియాతో మాట్లాడారు. 2024 జనవరి 22న ఆలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయం భవనం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల తెలిపారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.. ప్రధాని ట్వీట్
రామ మందిరం ప్రారంభోత్సవం ఆహ్వానం అందడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజని అన్నారు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు తనను కలవడానికి ఇంటికి వచ్చారని, శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్ననట్లు చెప్పారు. తన జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం తన అదృష్టమని మోదీ ట్వీట్ చేశారు.
అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు దాదాపు 161 అడుగులు, ఇందులో 360 స్తంభాలు ఏర్పాటు చేస్తారు. 2023 డిసెంబర్‌లో రాముడి ఆలయ నిర్మాణం పూర్తిచేసి, జనవరిలో బాల రాముడిని గర్భగుడిలో ప్రతిష్టించేలా. ప్రయత్నిస్తున్నారు. ఆయోధ్య రామ మందిర సంపూర్ణ నిర్మాణం డిసెంబర్ 2025 కల్లా పూర్తవుతుందని ఆలయ ట్రస్ట్ కమిటీ పేర్కొంది. ఆలయ నిర్మాణానికి రూ.1,400 కోట్ల నుంచి రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రామజన్మభూమి అయోధ్యలో రామ మందిర నిర్మాణం మూడు దశల్లో జరుగుతుంది. తొలి దశ నిర్మాణం పూర్తయ్యాక ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తంగా అయిదు మండపాలు ఉంటాయి. తొలి దశలోనే ఇవి పూర్తి కానున్నాయి. ఆలయంలో ఈ అయిదు మండపాలే అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నాయి. శ్రీరాముడి విగ్రహం ఇక్కడే ఉండనుంది. అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది.