Vande Bharat Sleeper Trains: వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్
Vande Bharat Sleeper Trains: భారత్ రైల్వేలో సరికొత్త సంచలనం వందే భారత్ రైళ్లు. ఇవి కేవలం 140 సెకన్ల సమయంలో 160 కి.మీ వేగాన్ని అందుకుంటాయి.
Vande Bharat Sleeper Trains: భారత్ రైల్వేలో సరికొత్త సంచలనం వందే భారత్ రైళ్లు. ఇవి కేవలం 140 సెకన్ల సమయంలో 160 కి.మీ వేగాన్ని అందుకుంటాయి. అంతే కాదు కుదుపులు లేకుండా ప్రయాణం సాగడం ఈ రైలు మరో ప్రత్యేకత. ప్రతి కోచ్‌లో ఎయిర్ కండిషన్ కోసం ‘కోచ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ సిస్టం’ ఉంటుంది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు స్టేషన్లు, ఇతర సమాచారం అందించేందుకు డిస్‌ప్లేలు ఉంటాయి. ఆటోమేటిగ్ డోర్లు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో సీట్లు 360 డిగ్రీల్లో తిరుగుతాయి. పెద్ద గాజు అద్దాల నుంచి ప్రకృతి అందాలను చూస్తూ జర్నీ అలా ఎంజాయ్ చేయొచ్చు.
విమానాల తరహాలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, అంధుల కోసం బ్రెయిలీ లిపిలో సమాచారం, వరదల నుంచి రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. సాంకేతిక తప్పిదం వల్ల రైళ్లు ఒకే ట్రాక్‌పై వస్తే, వాటి మధ్య కిలోమీటర్ దూరం ఉండగానే.. ఈ వ్యవస్థ హెచ్చరికలు చేసి, రైలు వేగాన్ని ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది. అయితే ఇందులో ప్రధాన మైనస్ పాయింట్లు ఏంటంటే సాధారణ రైళ్లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉండడం.
చాలా మంది ప్రయాణికులు రాత్రి పూట ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారు. అందుకు స్లీపర్ కోచ్‌లు అవసరం అవుతాయి. కానీ వందే భారత్‌లో స్లీపర్ కోచ్‌లు ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రైళ్లు అన్నీ పగటి పూటే ప్రయాణిస్తాయి. దీంతో చాలా మంది వందే భారత్ రైళ్లలో స్లీపర్ బెర్త్‌లు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతుండంతో రైల్వే ఆదిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రష్యాకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా సోమవారం కీలక అడుగు పడింది.
రష్యన్ రోలింగ్ స్టాక్ మేజర్, ట్రాన్స్ మాష్ హోల్డింగ్ (టీఎంహెచ్) సోమవారం 200 కోట్ల రూపాయలను బ్యాంక్ గ్యారెంటీ (PBG)గా రైల్వేలకు జమ చేసింది. దీంతో 120 స్లీపర్ వందే భారత్ రైళ్ల తయారీకి మార్గం సుగమమైంది. లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెలల ముందు, వచ్చే మార్చి నాటికి స్లీపర్ కోచ్‌తో కూడిన వందే భారత్ రైలు నమూనాను రూపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రష్యన్ రోలింగ్ స్టాక్ మేజర్ TMHతో రైల్వే PSU, RVNLతో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. అలాగే సెంట్రల్ పీఎస్‌యు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) టిటాగర్ వ్యాగన్స్ (టిడబ్ల్యుఎల్) మరో 80 వందే భారత్ రైళ్ల తయారీ టెండర్లను దక్కించుకుంది.
ఈ రైళ్లు సుదూర, రాత్రిపూట ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా 120 రైళ్లను ఈ జాయింట్ వెంచర్లు రూపొందించనున్నాయి. 35 ఏళ్ల పాటు నిర్వహణ సేవలను అందించనున్నాయి. ఈ రైళ్లన్నీ 2026 నుంచి 2030 సంవత్సరంలోపు డెలివరీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి రెండు నమూనా ట్రైన్లు ట్రైల్స్‌కి 2025నాటికే సిద్ధంకానున్నాయి. మొత్తం 400 వందే భారత్ రైళ్లను తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు భారతీయ రైల్వే మార్చిలో తెలిపింది. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఈ వందే భారత్ రైళ్లను భారత ప్రభుత్వం తెస్తోంది.