Pakistani Army Violates Ceasefire: పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలు, వరుసగా తొమ్మిదో రోజు LOC వద్ద కాల్పులు, తిప్పికొడుతున్న భారత సైన్యం
పాకిస్తాన్ దాడులతో ఎల్‌ఓసీలో వరుసగా తొమ్మిది రోజులు ఉద్రిక్తత. పహల్గాంలోని దాడి తర్వాత ఉద్రిక్తత పెరిగింది.

Kashmir Terror Attack: శ్రీనగర్: పాకిస్తాన్ ఆర్మీ మరోసారి సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంట పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే స్పందించిన భారత సైన్యం ఎదురుకాల్పులు జరిపి తిప్పి కొడుతోందని అధికారులు శనివారం తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయినా పాకిస్తాన్ ఓవైపు భయం నటిస్తూనే మరోవైపు సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద కాల్పులు జరుపుతూ భారత్‌ను కవ్విస్తోంది. ఈ క్రమంలో పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్ సైన్యం ఎల్‌వోసీ వద్ద వరుసగా తొమ్మిదవ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
"2025 మే 2 రాత్రి పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్ యూనియన్ భూభాగంలోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఆకస్మికంగా కాల్పులు జరిపిందని" భారత సైన్యం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. భారత సైన్యం పాక్ కాల్పులను తిప్పికొడుతోంది. పాక్ కాల్పులకు స్పందించి ఎదురు కాల్పులు జరుపుతోందని పేర్కొంది.
ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద నివసిస్తున్న ప్రజలు ఏదైనా దాడి జరిగినప్పుడు నివసించడానికి వీలుగా వ్యక్తిగత బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నారని సమాచారం. ప్రారంభించారు.
మే 1-2 రాత్రి ఎల్‌వోసీ వెంట కాల్పులు
మే 1-2 రాత్రి సైతం పాకిస్తాన్ సైన్యం కుప్వారా, బారముల్లా, పూంచ్, నౌషేరా, అఖ్నూర్ ప్రాంతాలలో ఎల్‌వోసీ వెంట ఉన్న పోస్టుల నుండి ఆకస్మికంగా కాల్పులు జరిపింది. వెంటనే స్పందించిన భారత్ దీటుగా బదులిచ్చింది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా జిల్లాలలో ఎల్‌వోసీ వెంట వివిధ పోస్టుల వద్ద పాకిస్తాన్ మొదట ఆకస్మికంగా కాల్పులు ప్రారంభించింది. ఆ తర్వాత కాల్పుల విమరణ ఉల్లంఘనలను పూంచ్ ఏరియాలో కొనసాగించింది. తరువాత జమ్ము ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్‌లోనూ పాక్ ఆర్మీ నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతోంది.
అనంతరం పాకిస్తాన్ బలగాలు రాజౌరి జిల్లాలోని సుందర్బానీ, నౌషేరా సెక్టార్‌లో ఎల్‌వోసీ వెంట అనేక పోస్టుల వద్ద చిన్న తుపాకులతో కాల్పులు ప్రారంభించాయి. ఆ తరువాత జమ్ము జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పార్గవాల్ సెక్టార్‌లో కాల్పులు జరిపి కవ్వింపు చర్యలకు దిగుతోంది.
పహల్గాంలో ఉగ్రదాడి తరువాత భారతదేశం 1960లో చేసుకున్న సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అట్టారీ, వాఘా సరిహద్దును మూసివేయడం, పాక్ హై కమిషన్ లో దౌత్యవేత్తలను తగ్గించడం, పాక్ పౌరులకు అన్ని రకాల వీసాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 24 రాత్రి నుంచి కశ్మీర్ లోయ నుంచి.. జమ్ము & కశ్మీర్‌లోని ఎల్‌వోసీ, ఐబీ వెంట పాకిస్తాన్ బలగాలు ప్రతిరోజూ ఆకస్మికంగా కాల్పులు జరుపుతున్నాయని భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు తమ మీద భారత్ సైన్యం విరుచుకు పడుతుందన్న భయంతో పాక్ సైన్యాన్ని అప్రమత్తం చేసింది. 29 జిల్లాల్లో ఎయిర్ సైరన్లు సైతం ఏర్పాటు చేసింది.






















