Padma Awards 2023: పద్మ పురస్కారాలు అందుకున్న చినజీయర్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సహా ప్రముఖులు
padma awards: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన యాభై మందికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.
padma awards: దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన యాభై మంది విశిష్ట వ్యక్తులకు మార్చి నెలలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. మిగతావారికి నేడు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు రాష్ట్రపతి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ప్రకటించడం తెలిసిందే.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ, వాస్తు శిల్పి బాలకృష్ణ దోషి (మరణానంతరం) దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా, రచయిత ప్రొఫెసర్ కపిల్ కపూర్, ఆధ్యాత్మికవేత్త, రామచంద్రమిషన్ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్ (తెలంగాణ), నేపథ్య గాయని సుమన్ కల్యాణ్‌పుర్ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ను స్వీకరించారు. ఆధ్యాత్మిక రంగంలో సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారాన్ని చిన్నజీయర్ స్వామి అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధా మూర్తిని సామాజిక సేవ రంగంలో పద్మభూషణ్‌తో సత్కరించారు. ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం)కు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన సతీమణి అందుకున్నారు.
#WATCH | Vedic scholar Tridandi Chinna Jeeyar, who conceptualised the Statue of Equality, Hyderabad, receives the Padma Bhushan from President Droupadi Murmu pic.twitter.com/bGaKpJ0hrm
— ANI (@ANI) April 5, 2023
నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి.. కళా రంగంలో సేవలకు పద్మ శ్రీ వరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ అందుకున్నారు. మిల్లెట్ మ్యాన్ ఖాదర్ వలి కూడా పద్మశ్రీ అందుకున్నారు. విజ్ఞాన రంగంలో సేవలకు ప్రొఫెసర్ నాగప్ప గణేష్, అబ్బారెడ్డి రాజేశ్వర్ రెడ్డి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సూపర్ 30 ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ప్రెసిడెంట్ ముర్ము నుండి పద్మశ్రీ అందుకున్నారు. ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘సూపర్ 30’ తెరకెక్కింది.
తెలంగాణ నుంచి పసుపులేటి హనుమంతరావు (వైద్య రంగం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య), డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), ఆంధ్రప్రదేశ్ నుంచి చింతలపాటి వెంకటపతి రాజు ( కళారంగం), కోట సచ్చిదానంద శాస్త్రి (కళా రంగం), డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ రావు (సామాజిక సేవ), ప్రొఫెసర్ ప్రకాష్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య) పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించారు.
#WATCH | Music composer MM Keeravani, who composed the song ‘Naatu Naatu’, receives the Padma Shri from President Droupadi Murmu pic.twitter.com/h0uFaNNP5U
— ANI (@ANI) April 5, 2023
పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారం రాత్రి విందు ఇచ్చారు.
ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 106 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్ మరియు 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు ఉన్నారు.
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటిగా పద్మ పురస్కారాలను భావిస్తారు. 1954లో స్థాపించబడిన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళ, సాహిత్యం, విద్య వంటి అన్ని రంగాలు/విభాగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు/సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డుకు ఎంపిక చేస్తారు. క్రీడలు, వైద్యం, సోషల్ వర్క్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మొదలైనవి రంగాలకు చెందిన వారిని పద్మ అవార్డులకు ఎంపిక చేస్తారు.