2024లో జమిలి ఎన్నికలు లేనట్టే, నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్
One Nation One Election: 2024లో జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమే అని లా కమిషన్‌కి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
One Nation,One Election:
2024లో జమిలి ఎన్నికలు లేనట్టే అని లా కమిషన్ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమే అని చెప్పింది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా లా కమిషన్ ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election) సాధ్యాసాధ్యాలపై భేటీ అయింది. అయితే...జమిలి ఎన్నికలపై రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. కానీ...ఈ రిపోర్ట్ ఇంకా ఖరారు కాలేదని ఇప్పటికే లా కమిషన్ వెల్లడించింది. ఇంకా అధ్యయనం చేయాల్సింది చాలా ఉందని, అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని స్పష్టం చేసింది. ఈ ఎన్నిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యానెల్‌ని కూడా నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ప్యానెల్‌కి నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్యానెల్ కూడా ఇటీవలే భేటీ అయింది. ఇందులో ఏం చర్చించారన్నది బయటకి తెలియలేదు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation,One Election)పై లా కమిషన్ సెప్టెంబర్ 27న సమావేశమైంది. లా కమిషన్ (Law Commission) చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. లా కమిషన్ ఏం చెబుతుంది..అని ఉత్కంఠగా ఎదురు చూసినప్పటికీ ఏ ప్రకటనా రాలేదు. దీనిపై ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నారు జస్టిస్ రీతూరాజ్. అందుకే రిపోర్ట్‌ని ఇంకా ఫైనలైజ్ చేయలేదని వెల్లడించారు.
"ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై ఇంకా లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అందుకే నివేదికను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. దీంతో పాటు పోక్సో యాక్ట్, ఆన్‌లైన్ FIRలకు సంబంధించిన రిపోర్ట్‌లు కూడా ఇంకా ఫైనలైజ్ కావాల్సి ఉంది."
- జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి, లాకమిషన్ చైర్మన్
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ చర్చించనుంది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేంద్రం తదుపరి కార్యాచరణ ఉండనుంది. ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఈ కమిటీలోని 8 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. వీరందరికీ రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహించనున్నారు. అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా ఈ కమిటీ నిర్ణయించనుంది. అంతే కాదు. ఇందుకోసం రాజ్యాంగంలో ఏమైనా సవరణలు చేయాల్సి ఉంటుందా అన్నదీ చర్చించనున్నారు సభ్యులు. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ జనరల్ సెక్రటరీ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు.
Also Read: తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం