తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
Cauvery Water Dispute: తమిళనాడు కర్ణాటక మధ్య కావేరి జల వివాదం ఎప్పుడు మొదలైంది?
Cauvery Water Dispute:
పొన్ని నది..
ఎన్నో ఏళ్లుగా దక్షిణ భారత దేశం గొంతు తడుపుతున్నాయి కావేరి నదీ జలాలు. తమిళనాడుతో ఈ నదికి విడదీయలేని బంధం ఉంది. కావేరి నది గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు తమిళులు. Ponni Nadi (బంగారు నది) అని ప్రేమగా పిలుచుకుంటారు. వాళ్ల సంస్కృతి అంతా ఈ నదితోనే ముడిపడిపోయింది. అందుకే కావేరిని చాలా పవిత్రంగా చూస్తారు. అటు తమిళనాడుతో పాటు ఇటు కర్ణాటకలోనూ సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తున్న ఈ నదీ జలాలపై ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. నీటి వాటాల కోసం ఈ రెండు రాష్ట్రాలూ తరచూ ఘర్షణ పడుతూనే ఉన్నాయి. "మా వాటా మాకు కావాల్సిందే" అని తమిళులు, "మీకు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏమైపోవాలి" అని కన్నడిగులు వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు మరోసారి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇదే విషయమై గొడవ జరుగుతోంది. అసలు ఈ వివాదం ఎప్పుడు మొదలైంది..? రెండు రాష్ట్రాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ ఎందుకు జరుగుతోంది..? ఈ వివాదం చుట్టూ ఉన్న రాజకీయాలేంటి..?
1892లోనే ఒప్పందం..
కావేరి నదీ జలాలు కర్ణాటక, తమిళనాడు మీదుగా ప్రవహిస్తూ చివరికి బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తాయి. దక్షిణ భారత దేశంలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చుతున్న, చాలా కీలకమైన నది ఇది. ఇప్పుడీ రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం ఇప్పటిది కాదు. 18వ శతాబ్దం నుంచే కొనసాగుతోంది. 1892లో ప్రిన్స్‌లీ స్టేట్ ఆఫ్ మైసూర్ (ఇప్పటి కర్ణాటక), మద్రాస్ ప్రెసిడెన్సీ (ఇప్పటి తమిళనాడు) మధ్య ఓ ఒప్పందం కుదిరింది. కావేరీ నదీ జలాల వాటాలు పంపిణీపై ఒప్పందం చేసుకున్నాయి. ఎవరి వాటా వాళ్లు పంచుకోవాల్సిందే అని 50 ఏళ్ల పాటు ఇది వర్తిస్తుందని 1924లో అధికారికంగా సంతకాలు చేశారు. అయితే...1956 తరవాత అసలు సమస్యలు మొదలయ్యాయి. అప్పుడే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ కొత్త రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా వాటాల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. 1924లో చేసుకున్న ఒప్పందం గడువు 1974లో ముగిసిపోయింది. ఆ తరవాత వాటాల విషయం తేల్చుకునే విషయంలో గొడవలు మొదలయ్యాయి. కరవు సమయాల్లో వాటాలు ఎలా పంచుకోవాలి..? సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు ఎలా పంచుకోవాలి..? అనే అంశాలపై వాదనలు కొనసాగాయి. ఎక్కువ వాటా కావాలని రెండు రాష్ట్రాలూ పట్టుబట్టాయి.
ట్రిబ్యునల్ ఏర్పాటు..
1986లో తమిళనాడు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ డిమాండ్‌ని అనుగుణంగానే... వాటాల పంచాయితీ తీర్చేందుకు 1990లో Cauvery Water Disputes Tribunal (CWDT) ఏర్పాటైంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి మధ్య ఉన్న నీటి వాటాల వివాదాల్ని పరిష్కరించడమే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. 1991లో ఈ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వం 205 TMCల మేర కావేరీ నదీ జలాలను తమిళనాడుకి విడుదల చేయాలని ఆదేశించింది. కానీ అందుకు కర్ణాటక అంగీకరించలేదు. ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పటికీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. 2007లో మాత్రం కీలక పరిణామం జరిగింది. నీటి కొరత ఉన్నప్పుడు ఎంత వాటాలు పంచుకోవాలి..? అనే విషయంలో క్లారిటీ ఇచ్చింది ట్రిబ్యునల్. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలు ఎలా వాటాలు పంచుకోవాలో చెప్పింది.
తమిళనాడుకి 41.92%, కర్ణాటకకి 27.36%, కేరళకి 12%, పుదుచ్చేరికి 7.68% వాటాలు కేటాయించింది. మొత్తంగా ఈ కావేరీ బేసిన్‌లోని 740TMCల నీళ్లను ఆదేశించిన రీతిలో పంచుకోవాలని స్పష్టం చేసింది. కేరళ, పుదుచ్చేరి ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయనప్పటికీ తమిళనాడు, కర్ణాటక మాత్రం అందుకు అంగీకరించలేదు. తమ వాటాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశాయి.
న్యాయ పోరాటం..
ముందుగా 2012లో కర్ణాటకలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు వచ్చినా వాటా సరిపోలేదని, CWDT కేటాయింపులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది కర్ణాటక ప్రభుత్వం. అప్పట్లో ఇది రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. జేడీఎస్‌కి చెందిన నేతలు కొందరు రాజీనామా చేశారు. 2016లో ఈ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 6 వేల క్యూసెక్కుల కావేరి నదీ జలాలను 10 రోజుల పాటు తమిళనాడుకి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీనిపై రాష్ట్రంలో ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా...ఈ వివాదం హింసాత్మకంగా మారింది. ఆ తరవాత ఇదే సుప్రీంకోర్టు మరో తీర్పునిచ్చింది. తమిళనాడు వాటాని 177.25 TMCల మేరకు తగ్గించింది. ఇది తమిళనాడులో అలజడి సృష్టించింది. Cauvery Water Management Board (CWMB)ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది తమిళనాడు ప్రభుత్వం. 2018లోనూ అక్కడక్కడా దీనిపై నిరసనలు జరిగాయి.
ఇప్పుడు వివాదం దేనికి..?
ఇప్పుడు కొత్తగా వివాదం దేనికంటే...తమిళనాడు ప్రభుత్వం దాదాపు 15 రోజుల పాటు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కానీ కర్ణాటక ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. 15 రోజుల్లో 8 వేల క్యూసెక్కుల నీటని మాత్రమే విడుదల చేస్తామని వెల్లడించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా అంత మొత్తం విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అటు కర్ణాటక కూడా తమ వాదన వినిపించింది. Cauvery Water Management Authority (CWMA) ఇచ్చిన ఆదేశాలనూ కర్ణాటక ప్రభుత్వం సవాల్ చేసింది. వర్షపాతం తక్కువ నమోదైన కారణంగా ఈ ఆదేశాలను రివ్యూ చేసుకోవాలని లేఖ రాసింది. చాలా చర్చల తరవాత సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15 మధ్యలో 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై తమిళనాడులో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రెండు రాష్ట్రాలు కావేరి నదీ జలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి.
Also Read: ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత