Mohan Charan Majhi: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ, రాష్ట్ర చరిత్రలో తొలిసారి బీజేపీ సర్కార్
Odisha CM Mohan Charan Majhi: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభా పక్షనేతగా మోహన్ మాఝీని పార్టీ ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
Mohan Charan Majhi elected as Leader of BJP Legislative Party in Odisha | భువనేశ్వర్: ఒడిశా బీజేపీ శాసనసభా పక్షనేతగా మోహన్ చరణ్ మాఝీ ఎన్నికయ్యారు. ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఒడిశా సీఎంగా చరణ్ మాఝీ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఒడిశాలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. దాంతో ఒడిశాలో తొలి బీజేపీ సీఎంగా చరణ్ మాఝీ నిలవనున్నారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జూన్ 12న ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇద్దర్నీ డిప్యూటీ సీఎంలుగా బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఒడిశా డిప్యూటీ సీఎంగా కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవాతి పరీదాలు బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం మోహన్ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలు, మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
#WATCH | BJP MLA Mohan Charan Majhi to be the new CM of Odisha.
— ANI (@ANI) June 11, 2024
Kanak Vardhan Singh Deo and Pravati Parida to be the Deputy Chief Ministers. pic.twitter.com/QUpORT6Aeu
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి
ఒడిశా ఎన్నికల్లో బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కి బీజేపీ భారీ షాకిచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకుగానూ బీజేపీ 78 స్థానాల్లో గెలుపొంది రాష్ట్ర చరిత్రలో తొలిసారి అధికారం చేపడుతోంది. బిజు జనతా దళ్ (BJD) పార్టీకి 51 సీట్లు రాగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో, సీపీఐఎం ఒక్క సీటు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. 25 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ ఒడిశా రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. కానీ బీజేడీ కంచుకోటను బీజేపీ బద్ధలుకొట్టి, నవీన్ పట్నాయక్‌ను అధికారానికి దూరం చేసింది.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో మోదీ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అనారోగ్యంగా ఉంటున్నారని, ఆయన గతంలోలాగ యాక్టివ్ లేరని మోదీ అన్నారు. ఆయన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించేలా చేశారని, కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక దీనిపై ఓ కమిటీ వేస్తామని సైతం చెప్పడం ఒడిశా రాజకీయాల్లో దుమారం రేపింది.