హిందువులను బెదిరించిన గురుపత్వంత్ సింగ్‌కి NIA షాక్, ఇండియాలోని ఆస్తులన్నీ సీజ్
Gurpatwant Singh Pannu: ఖలిస్థాన్ సానుభూతిపరుడు గురుపత్వంత్ సింగ్ ఆస్తుల్ని NIA సీజ్ చేసింది.
Gurpatwant Singh Pannu:
ఛండీగఢ్‌లో ఆస్తులు సీజ్
కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ ఖలిస్థాన్ వేర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నుపై భారత్ చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. అమృత్‌సర్, ఛండీగఢ్‌లోని గురపత్వంత్ సింగ్ ఆస్తుల్ని సీజ్ చేసింది. అమృత్‌సర్‌కి చెందిన గురుపత్వంత్‌పై రివార్డు కూడా ప్రకటించింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్...అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ ఇతనిపై 7 కేసులు నమోదయ్యాయి. ఇందులో దేశ విద్రోహ కేసు కూడా ఉంది. చాలా రోజులుగా గురుపత్వంత్ నేర చరిత్రపై కెనడాని అలెర్ట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పటి వరకూ ఆ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు. అందుకే స్వయంగా భారత్ రంగంలోకి దిగి ఖలిస్థాన్ సానుభూతిపరులపై చర్యలు తీసుకుంటోంది. ఛండీగఢ్‌లోని సెక్టార్ 15లో ఉన్న గురుపత్వంత్ సింగ్ ఇంటిని సీజ్ చేసింది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న గురుపత్వంత్‌పై ఇంకా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దాదాపు అరగంట పాటు అతని ఇంట్లో సోదాలు నిర్వహించిన NIA జప్తు చేసింది. ఆ తరవాత ఇంటి ముందు ఓ నోటీస్ బోర్డ్ పెట్టింది. అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్ గ్రామంలో గురుపత్వంత్ సింగ్‌కి చెందిన వ్యవసాయ భూమినీ జప్తు చేసింది NIA.ఇప్పటికే భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఈ చర్యలు మరింత ఉద్రిక్తతలు దారి తీస్తాయా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే..భారత్ ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. కెనడా ప్రధాని చేస్తున్న ఆరోపణల్నీ తిప్పికొడుతోంది.
#WATCH | On the orders of the NIA court, NIA officials pasted a property confiscation notice outside a house owned by banned Sikhs for Justice (SFJ) founder and designated terrorist Gurpatwant Singh Pannu, in Chandigarh. pic.twitter.com/Q2p59nrdlt
— ANI (@ANI) September 23, 2023
ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ Sikhs for Justice (SFJ) కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చింది. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. SFJ లీగల్ కౌన్సిల్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ (Gurpatwant Singh Pannun) ఈ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హిందువులందరూ వెంటనే కెనడా విడిచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఖలిస్థాన్ మద్దతుదారులు చాలా గొప్ప ఉద్యమం చేస్తున్నారని, దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే ఉద్యమిస్తున్నారని స్పష్టం చేశారు గురుపత్వంత్ సింగ్. అయితే...భారత్ మాత్రం గురుపత్వంత్‌ని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఈ వీడియో వైరల్ అవడం వల్ల మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
"కెనడాలోని హిందువులంతా వీలైనంత త్వరగా ఇండియాకి వెళ్లిపోండి. మీరు సపోర్ట్ చేసేది ఇండియాకి మాత్రమే కాదు. ఖలిస్థాన్ మద్దతుదారుల భావ ప్రకటనా స్వేచ్ఛని అణిచివేయడాన్నీ సపోర్ట్ చేస్తున్నారు. ఖలిస్థాన్‌కి మద్దతునిచ్చే సిక్కుల వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. షహీద్ నిజ్జర్ని దారుణంగా హత్య చేస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు"
- గురుపత్వంత్ సింగ్ పన్నన్, సిక్స్ ఫర్ జస్టిస్
Also Read: కుమారస్వామికి బెస్టాఫ్ లక్ చెప్పిన డీకే శివకుమార్, ఎన్డీఏ కూటమిలో చేరడంపై వ్యాఖ్యలు