Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
Kumbh Mela Stampede: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. గతంలో ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో ఈ తరహా విషాదాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఓసారి చూస్తే..
![Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే! major stampede incidents in india over the years Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/4993c204cef543bd0e4a50e48215c18e1738135435186876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stampede Incident In India Over The Years: ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో (Maha Kumbhmela 2025) బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది. మౌని అమావాస్యం సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు భక్తులు తెల్లవారుజామున అధిక సంఖ్యలో తరలిరాగా.. సెక్టార్ 2 వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు. దాదాపు 100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. మన దేశంలో గతంలోనూ ఇలాంటి విషాద ఘటనలు జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు సమయాల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ప్రమాదాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం ఆయా కార్యక్రమాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఎన్ని పటిష్ట చర్యలు చేపడుతున్నా.. ఎక్కడో ఓ చోట వదంతులు, భక్తుల్లో భయాలు, అత్యుత్సాహాలు ఈ ఘటనలకు కారణమవుతున్నాయి. దేశంలో గతంలో జరిగిన విషాద ఘటనలను ఓసారి పరిశీలిస్తే..
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. అప్పట్లో ఫిబ్రవరి 3న జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలోనే పెను విషాదంగా నిలిచింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా... 2 వేల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం సైతం మౌని అమావాస్య రోజే జరగ్గా.. ఓ ఏనుగు అదుపు తప్పి దూసుకురావడంతో ఈ ఘటన జరిగినట్లు అప్పట్లో కథనాలు పేర్కొన్నాయి.
- 1986.. ఏప్రిల్ 14న హరిద్వార్‌లో కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి యూపీ సీఎం వీర్‌బహదూర్ సింగ్ తనతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులను తీసుకొని హరిద్వార్‌లో స్నానాలకు రాగా రద్దీని నియంత్రించలేక తొక్కిసలాట చోటు చేసుకుంది.
- 2003లో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు.
- 2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10న ఫుట్ బ్రిడ్జి కూలి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఊపిరి తీసిన పాద ధూళి - గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్‌రాయ్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబా పాదాల వద్ద మట్టిని తీసుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కాగా.. ఈ దుర్ఘటన జరిగింది.
వదంతులు ప్రాణం తీశాయి
- మధ్యప్రదేశ్‌లోని రత్నఘడ్ మందిరంలో 2013, అక్టోబర్ 13న నవరాత్రి సందర్భంగా దాదాపు 1,50,000 మంది భక్తులు వచ్చారు. అక్కడ ఓ వంతెన కూలిపోయే స్థితికి వచ్చిందన్న వదంతులు రావడంతో ఒక్కసారిగా జనం పరుగులు తీయడంతో తోపులాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంలో 2008 ఆగస్టులో తోపులాట జరిగి 145 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చరియలు విరిగి పడుతున్నాయనే వదంతులే ఈ దుర్ఘటనకు కారణమని గుర్తించారు.
పేలుడు భయంతో..
రాజస్థాన్‌లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాట ఘటనలో 224 మంది ప్రాణాలు కోల్పోగా.. 420 మంది గాయపడ్డారు. బాంబు పేలుడు భయంతోనే ఈ ప్రమాదం జరిగిందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.
జారుడు మెట్లతో..
మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి 2005 జనవరిలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వెళ్లే మెట్లు జారుడుగా ఉండడంతో జనం ఒకరిపై మరొకరి పడి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)