Maoists Letter : "హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
Maoists Letter : హిడ్మా తోపాటు పదుమూడు మందిని పోలీసులు హత్య చేశారని ఎన్‌కౌంటర్ పేరుతో నాటకాలాడుతున్నారని ఆరోపిస్తూ లెటర్ రిలీజ్ చేశారు.

Maoists Letter : మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత సైలెంట్‌గా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు కీలక ప్రకటన చేశారు. వికల్ప్ పేరుతో ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిడ్మాతోపాటు 13 మంది పోలీసులు హత్య చేశారని ఆరోపించారు. వారి రహస్య సమాచారాన్ని చేరవేసిన వారి పేర్లను కూడా ఆ లేఖలో తెలిపారు. వారి కారణంగానే హిడ్మాను పట్టుకొని హత్య చేశారని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు.
హిడ్మా అక్టోబర్ 27వ తేదీన విజయవాడ వచ్చినట్టు మావోయిస్టులు పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వచ్చినట్టు లేఖలో తెలిపారు. అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్న కోసాల్ అనే కలప వ్యాపారితోపాటు మరో ముగ్గురు కాంట్రాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారని ఆరోపించారు. దీని గురించి తెలుసుకున్న పోలీసులు హిడ్మాను పట్టుకొని కాల్చి చంపేశారని అన్నారు. ఆయనతోపాటు 13 మందిని హత్య చేశారని ధ్వజమెత్తారు.
హిడ్మా రహస్య సమాచారాన్ని దేవజీ చెప్పాడనే పుకార్లు నమ్మొద్దన్నారు. ప్రస్తుతం దేవ్‌జీ తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. హిడ్మా ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం కోసాల్ అనే కలప వ్యాపారి సహాయంతో విజయవాడ చేరుకున్నాడని వివరించారు. ఈ విషయాన్ని ఆయన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి పోలీసులకు చేరవేశారని తెలిపారు. హిడ్మాతోపాటు మరో 13 మందిని మారేడుమిల్లి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి చంపేశారని ఆరోపించారు.
కేంద్రం బలగాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి జరిపిన జాయింట్ ఆపరేషన్ కాదని, హిడ్మాను వాళ్లంతా కలిసి చంపేశారని మావోయిస్టులు లేఖో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ హత్యను కప్పిపుచ్చుకోవడానికి మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ అని కట్టుకథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు.
బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్ 13 మంది హతం
మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం (డిసెంబర్ 3)న ప్రారంభమైన పోలీసు-నక్సల్ ఎన్‌కౌంటర్ గురువారం (డిసెంబర్ 4) ఉదయం వరకు కొనసాగింది. ఈ సుదీర్ఘమైన, భయంకరమైన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు 18 మంది నక్సల్స్‌ను హతమార్చాయి. వీరిలో 9 మంది మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. మరణించిన నక్సల్స్‌లో 16 మందిని గుర్తించారు. వీరంతా PLGA బెటాలియన్ నంబర్-2కి చెందిన యాక్టివ్ కేడర్‌లు. వీరిపై మొత్తం 1 కోటి 30 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.
వెల్లా మోడియం సహా పలువురు పెద్ద నక్సల్ కమాండర్లు హతం
ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సల్స్‌లో PLGA కంపెనీ నంబర్-2 కమాండర్ వెల్లా మోడియం కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు, అతనిపై 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. బీజాపూర్ జిల్లాలో అతనిపై 44 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ప్లాటూన్ నంబర్-13 కమాండర్ DVCM జిత్ర్ ఓయం, DVCM మోటు కవాసి కూడా హతమయ్యారు. భద్రతా బలగాలు చాలా కాలంగా వీరి కోసం వెతుకుతున్నాయి. వీరంతా పశ్చిమ బస్తర్ డివిజన్‌కు చెందిన యాక్టివ్ మావోయిస్టులు.
సమాచారం తర్వాత పెద్ద సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం
కచిల్వార్-పోటేనార్ అడవుల్లో PLGA కంపెనీ నంబర్-2 కమాండర్ వెల్లా మోడియం తన దాదాపు 25-30 మంది మావోయిస్ట్ కేడర్‌లతో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందిందని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ పి తెలిపారు. సమాచారం అందుకున్న తర్వాత DRG, STF, కోబ్రా బెటాలియన్ల సంయుక్త బృందాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఉదయం 9 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయి. రాత్రి అంతా ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. గురువారం ఉదయం 8 గంటల వరకు ఎన్‌కౌంటర్ కొనసాగింది. భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి 19 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి, వాటిలో 4 AK-47లు, 1 లైట్ మెషిన్ గన్, 4 SLRలు, 3 నాట్-3 రైఫిల్స్, ఇన్సాస్, 12 బోర్ గన్‌లు ఉన్నాయి. దీనితో పాటు, భారీగా పేలుడు పదార్థాలు, నక్సల్స్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.





















