Deepika Kothari: అతడుగా మారుతున్న ఆమె, మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ ఆపరేషన్‌కు అనుమతి
Deepika Kothari: మధ్యప్రదేశ్ కు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని అతడిలా మారనుంది. ఈ మేరకు సర్కారు అనుమతించింది.
Deepika Kothari: అతడు నుంచి ఆమెగా, ఆమె నుంచి అతడిగా మారుతున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య, సామాజిక కారణాల వల్ల చాలా మంది లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని మహిళ నుంచి పురుషునిగా, పురుషుడి నుంచి స్త్రీగా మారుతున్నారు. ఇష్ట ప్రకారం జీవించడానికి లింగ మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారు సంఖ్య పెరిగిపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళా పోలీసు అధికారి కూడా అదే పని చేసింది. ఇన్ని రోజులు మహిళగా గుర్తింపు పొందిన ఆమె.. ఇకపై పురుషునిగా మారి అతడిగా పిలిపించుకోనున్నాడు. తన లింగ మార్పిడి కోసం మధ్యప్రదేశ్ హోం శాఖ అనుమతి కూడా ఇచ్చింది.
మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లాలో దీపికా కొఠారి కానిస్టేబుల్ గా సేవలు అందిస్తోంది. ఆమె చిన్నప్పటి నుంచి జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతోంది. అంటే.. బయోలాజికల్ గా ఆమె ఓ మహిళ. కానీ తనను తాను ఎప్పుడూ పురుషుడిగానే భావించేది దీపికా. శరీరం మహిళది అయినప్పటికీ ఆమెలో లక్షణాలు పురుషుడిలా ఉండేవి. చిన్నతనంలో ఈ వింత ధోరణిని అర్థం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత అర్థం చేసుకున్నా.. ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఎవరికైనా చెబితే తప్పుగా అనుకుంటారని, హేళన చేస్తారని భయపడింది. లోపల పురుషుడిగా ఉంటూ.. బయటకు మాత్రం మహిళగా నడుచుకునేది. ఇదే క్రమంలో కానిస్టేబుల్ గా ఉద్యోగం కూడా సంపాదించింది. అయితే.. రోజులు గడిచే కొద్దీ తనలోని పురుష లక్షణాలు పెరిగాయి తప్పితే తగ్గలేదు. తన సమస్యకు పరిష్కారం కోసం ఢిల్లీలోని ఓ వైద్యుడిని సంప్రదించింది దీపికా కొఠారి. ఆమెను పరీక్షించిన వైద్యుడు.. లింగ మార్పిడి చేయించుకోవడమే సమస్యకు పరిష్కారమని తేల్చి చెప్పాడు.
ఆమె నుంచి అతడిగా మారితేనే జీవితం ఆనందంగా ఉంటుందని.. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండొచ్చని ఆ వైద్యుడు చెప్పడంతో.. దీపికా కొఠారి అయోమయానికి గురైంది. చివరికి డాక్టర్ చెప్పినట్లుగా లింగ మార్పిడి చేయించుకునేందుకు సిద్ధపడింది. అయితే తానో కానిస్టేబుల్.. లింగ మార్పిడి కోసం సంబంధిత శాఖ నుంచి తప్పకుండా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీపికా ఈ ఏడాది జనవరిలో లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసి, లింగ మార్పిడి కోసం అనుమతించాలంటూ అభ్యర్థించింది.
Also Read: Krishna River: వర్షాలు లేక కృష్ణమ్మ వెలవెల, తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి నిల్వ
సర్కారు తన ఆపరేషన్ కు అనుమతి ఇవ్వడానికి ముందు పలు పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 15వ తేదీన డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు ఆమెను పరీక్షించింది. ఆమెలో ఉన్న సమస్యను గుర్తించి, తన నివేదికను సివిల్ సర్జన్ కు సమర్పించింది. ఈ నివేదికని పరిశీలించిన తర్వాత.. దీపికా కొఠారి మహిళ నుంచి పురుషునిగా మారేందుకు అనుమతి లభించింది. న్యాయశాఖ అభిప్రాయాన్ని, సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసులో లింగ మార్పిడికి దీపికా కొఠారికి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే.. లింగ మార్పిడి తర్వాత స్త్రీ నుంచి పురుషునిగా మారిన అనంతరం.. మహిళలకు సంబంధించిన ప్రత్యేక సేవలు ఉండవని ఆ శాఖ దీపికా కొఠారికి తేల్చి చెప్పింది. గతంలోనూ ఓ మహిళ.. ఇలాగే తన జెండర్ ను మార్చుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లింగ మార్పిడికి అనుమతి పొందిన రెండో మహిళా కానిస్టేబుల్ గా దీపికా కొఠారి నిలిచింది.