Krishna River: వర్షాలు లేక కృష్ణమ్మ వెలవెల, తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి నిల్వ
Krishna River: పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదిలో నీరు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఉంది.
Krishna River: నదిలో నీటి ప్రవాహం లేక కృష్ణమ్మ వెలవెలబోతోంది. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో.. నదిలో నీటి ప్రవాహం లేదు. మరో నాలుగైదు రోజులు వానలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. తాగు, సాగునీటిపరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సాగరే తాగునీటికి ప్రధాన వనరు కావడంతో, సాగర్ లో నీరు లేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునేందుకు కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా.. ప్రస్తుతం ఈ జలాశయంలో 518 అడుగుల వద్ద నీటి నిల్వ ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 145.83 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు శ్రీశైలం నుంచి 32 టీఎంసీలు రావడంతో ఈ మాత్రం నిల్వ ఉంది. లేదంటే పరిస్థితి మరింత దారణంగా ఉండేదని అధికారులు అంటున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు.. గత సంవత్సరం ఈ రోజుకు 584.90 అడుగుల స్థాయిలో నీరు ఉండేది. అంటే 297.15 టీఎంసీల నీరు ఉంది.
267 టీఎంసీల మేర ఖాళీ
కర్ణాటకలో మొన్నటి వరకు ఓ మోస్తరు వానలు కురిశాయి. దాంతో ఆలమట్టి నుంచి నారాయణపూర్ కు 98.90 టీఎంసీలను విడుదల చేశారు. నారాయణపూర్ నుంచి జూరాల జలాశయానికి 100 టీఎంసీల నీరు వచ్చింది. జూరాలతో పాటు తుంగభద్ర పరీవాహకం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 100.77 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. శ్రీశైలం జలాశయంలో మంగళవారం నాటికి 885 అడుగులకు గాను 862.90 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు 115 టీఎంసీల నీరు ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నిండేందుకు చేరువ కావడం ప్రస్తుతం కొంతలో కొంత ఊరట కలిగిస్తోంది. ఈ నదీ పరీవాహకంలో వర్షాలు కురిస్తే ఇక దిగువకు నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడానికి మరో 100 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. దీని వల్ల రోజుు 12 వేల నుంచి 27 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నాగార్జున సాగర్ జలాశయం వైపు వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ వైపు 14 వేల క్యూసెక్కులను కాల్వలకు వదులుతున్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ లు రెండూ కలిపి మొత్తంగా 267 టీఎంసీల మేర ఖాళీ ఉందని అధికారులు చెబుతున్నారు.
Also Read: Airport Metro: వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు, 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు!
శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 115 టీఎంసీల నీరు ఉంది. గతేడాది ఈ సమయానికి 213.40 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 145.83 టీఎంసీల నిల్వ ఉంది. గతేడాది ఈ సమయానికి 297.15 టీఎంసీల నీటి నిల్వ ఉంది.