MP Court: రూ. 72 లక్షల మోసం చేసిన వ్యక్తికి 170 ఏళ్ల జైలు శిక్ష, మధ్యప్రదేశ్ కోర్టు సంచలన తీర్పు
MP Court: మధ్యప్రదేశ్ లోని సెషన్స్ కోర్టు మోసాలకు పాల్పడ్డ వ్యక్తి 170 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తను మోసం చేసిన ప్రతి ఒక్కరికీ 10 వేలు చెల్లించాలని ఆదేశించింది.
MP Court: బట్టల కంపెనీ ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెప్పి 34 మందిని 72 లక్షలు మోసం చేసిన ఓ వ్యక్తికి మధ్యప్రదేశ్ సాగర్‌లోని సెషన్స్ కోర్టు 170 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒకే వ్యక్తికి ఇన్ని ఎక్కువ రోజులు జైలు శిక్ష విధించిన ఘటనలు భారత్‌లో చాలా అరుదు. గత మార్చిలో మధ్యప్రదేశ్ కు చెందిన సెహోర్ కోర్టు కూడా ఇలాంటి అరుదైన తీర్పునే ఇచ్చింది. ఒక చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్ కు ఏకంగా 250 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ కేసులో బాధితుల సంఖ్య 35 లక్షలపైమాటే. అలాగే మోసం చేసిన మొత్తం 4 వేల కోట్ల కంటే ఎక్కువే.
గరిష్ఠంగా 7 సంవత్సరాలు మాత్రమే శిక్ష విధించే అవకాశం..
తాజాగా మధ్యప్రదేశ్ కోర్టు శిక్ష విధించిన దోషి పేరు నాసిర్ మొహమ్మద్. గుజరాత్ కు చెందిన నాసిర్ మొహమ్మద్ అలియాస్ నాసిర్ రాజ్ పుత్ (55).. తాను మోసం చేసిన 34 మందికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా కోర్టు తీర్పులో పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 420(మోసం) కింద మొహమ్మద్ ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో గరిష్ఠంగా 7 సంవత్సరాలు మాత్రమే శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో నాసిర్ 34 మందిని మోసం చేశాడు. దీంతో అప్పర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్లా అహ్మద్.. ప్రతి బాధితుడికి న్యాయం జరగాలని, వాళ్ల తరఫున కూడా నాసిర్ కు శిక్ష విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మొత్తం 34 మంది తరఫున 5 ఏళ్ల జైలు శిక్ష అంటే 170 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది సెషన్ కోర్టు.
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని భైంసా, సదర్ గ్రామాల వాసులు మొహమ్మద్ తమను మోసం చేశాడని ఆరోపిస్తూ 2019 చివర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారని జిల్లా ప్రాసిక్యూషన్ మీడియా ఇన్ ఛార్జ్ సౌరభ్ దిమ్హా తెలిపారు. మొహమ్మద్ నాసిర్ 2018 చివర్లో వారి ప్రాంతానికి వెళ్లినట్లు దిమ్హా చెప్పారు. అక్కడి స్థానికులతో నాసిర్ సత్సంబంధాలు పెంచుకున్నాడని అన్నారు. నాసిర్ జీవనశైలి చాలా విలాసవంతంగా ఉండేదని, అందరికి తానో ధనవంతుడు అనిపించేలా భ్రమ కలిపించాడని తెలిపారు. రియల్ ఎస్టేట్ విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని గార్మెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడి పెట్టేందుకు వేచి చూస్తున్నట్లు అక్కడి స్థానికులతో నాసిర్ చెప్పాడు. అయితే కొన్ని ట్యాక్స్ సమస్యల కారణంగా రిజర్వ్ బ్యాంకులో తన రూ.7.85 కోట్లు ఇతర బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయకుండా నిలిపివేశారని నాసిర్ పేర్కొన్నాడు. తన కుమారుడు కంబోడియా, వియాత్నం, దుబాయ్ లో ఉంటూ అక్కడి వ్యాపారాలను చేస్తున్నారని స్థానికులను నమ్మించారు.
అలా వారికి మాయమాటలు చెప్పి 34 మంది నుంచి రూ.72 లక్షలు వసూలు చేశాడు. వారు తమ డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ వాళ్లు ఒత్తిడి ఎక్కువ చేయడంతో పారిపోయాడు. ఆ తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 2020 డిసెంబర్ 19వ తేదీన కర్ణాటకలోని కుల్బర్గాలో అరెస్టయ్యాడు. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్ సెషన్స్ వేసిన 170ఏళ్ల జైలు శిక్ష ఉన్నత న్యాయస్థానాల్లో నిలిచే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒకే తరహా మోసంలో శిక్ష ఏకకాలంలో ఉంటుంది. భిన్నమైన మోసాలకు పాల్పడితే శిక్ష ఒకదాని తర్వాత ఒకటి ఉంటుందని అంటున్నారు.