Lok Sabha Security Breach: పార్లమెంట్ ఘటనలో ఐదుగురు అరెస్ట్, మరొకరి కోసం గాలింపు
Lok Sabha Security breach:పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ లోక్‌సభలోకి దుండగులు దూసుకురావడం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ...లోక్‌సభ(Loksabha)లోకి దుండగులు దూసుకురావడం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో ఆరుగురి (Six Members) ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు (Arrest)చేసిన ఢిల్లీ పోలీసులు...మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దుండగులు పక్కా ప్రణాళిక, పరస్పర సమన్వయంతోనే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులందరికీ నాలుగేళ్లుగా పరిచయం ఉందని, కొద్ది రోజుల క్రితమే రెక్కీ కూడా నిర్వహించారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి ఎంపీలను భయాందోళనకు గురిచేసిన సాగర్ శర్మ, మనో రంజన్ డి అనే వ్యక్తులను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. అమోల్ శిందే, నీలమ్‌ను పార్లమెంటు భవనం బయట అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు. వీరితో పాటు లలిత్, విక్రమ్ అనే మరో ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. దీంతో విక్రమ్‌ను గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకోగా.. లలిత్ కోసం గాలింపు చేపట్టారు.
పార్లమెంటుకు వచ్చే ముందు వీరంతా గురుగ్రామ్‌లోని విక్రమ్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రణాళిక ప్రకారం ఆరుగురూ పార్లమెంటు లోపలికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఇద్దరికే విజిటర్ పాసులు దొరికాయి. నాలుగేళ్లుగా ఒకరితో ఇంకొకరికి పరిచయం ఉందని.. సామాజిక మాధ్యమాల వేదికగా కాంటాక్టు అయ్యేవారని పోలీసులు గుర్తించారు. ఈ తరహా దాడికి ప్రయత్నించాలని ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థ ఆదేశించిందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. నిందితులు లోక్‌సభలోకి వెళ్లేందుకు అవసరమైన పాసులు మైసూరు ఎంపీ ప్రతాప్‌సింహా కార్యాలయం నుంచి జారీ అయ్యాయి. దీంతో ఆయన కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. లోక్‌సభలో జరిగిన భద్రతా వైఫల్యానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటు లోపల, బయట పసుపు రంగుతో కూడిన పొగ విడుదల చేస్తూ ఎంపీలు, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. సంచలనం కోసం దుండగులు చేసిన ఈ చర్యతో యావత్ దేశం ఉలిక్కిపడింది. అయితే, ఇవి సాధారణ రంగులతో కూడిన వాయువులు విడుదల చేసేవేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఊరట కలిగించింది. ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారని అన్నారు. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతామని ఎంపీలకు హామీ ఇచ్చారు. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని...ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.