వయనాడ్ బాధితురాలు శృతి జీవితంలో మరో పెను విషాదం.. ప్రేమించిన వాడ్నీ బలితీసుకున్న విధి
Wayanad Updates: వయనాడ్ విలయం కుటుంబసభ్యుల్ని మింగేస్తే.. రోడ్ యాక్సిడెంట్ తన జీవితాన్ని మింగేసింది. మనో నబ్బరంతో అందరి దృష్టిని ఆకర్షించిన శృతి మళ్లీ 40 రోజుల వ్యవధిలోనే అనాథగా మిగిలింది.
Kerala News: వయనాడ్ విలయంలో వేలాది మంది తమవాళ్లను పొగొట్టుకున్నారు. కేరళలోని చూరాల్‌మల గ్రామానికి చెందిన శృతి కూడా అందులో ఒకరు. ఆమె తన కుటుంబంలోని.. అమ్మ నాన్నలు, సోదరి సహా 9 మందిని పోగొట్టుకొని ఏకాకిగా మిగిలారు. ఆ సమయంలో తను ప్రేమించిన యువకుడు జెన్సన్ ఆమెకు అండగా నిలబడ్డాడు. తాను కోల్పోయిన ప్రేమను అందిస్తూ భరోసా ఇచ్చాడు. అతడి అండగా శృతి ప్రదర్శించిన నిబ్బరాన్ని చూసి ప్రధాని నరేంద్రమోదీ సహా యావత్ దేశం అభినందించింది. వయనాడ్ బాధితుల పరామర్శకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ ఈ జంటను ప్రముఖంగా పలుకరించారు. వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆ జంట ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలని విలయం నుంచి కోలుకుంటున్న వయనాడ్ మొత్తం ఆకాంక్షించింది. కానీ విధి వాళ్ల పట్ల క్రూరంగా వ్యవరహరించింది. జెన్సన్‌ను కూడా పొట్టన పెట్టుకుంది.
మతాలు వేరైనా శృతి, జెన్సన్‌ల ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు జూన్ 2న వారికి నిశ్చితార్థం కూడా జరిపింది. ఇక పెళ్లి భాజాలు మోగాల్సిన సమయంలో వరదలు, విరిగిపడిన కొండ చరియలు రూపంలో శృతి కుటుంబం మొత్తాన్ని మృత్యువు మింగేసింది. ఆ సమయంలో తన ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి జెన్సన్ ఆమెకు ఎంతో ఓదార్పుగా నిలిచాడు. భవిష్యత్‌పై భరోసా కల్పించాడు. జాతీయ మీడియా కూడా ఆ జంటపై అనేక కథనాలు ప్రచురించింది. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశాన వాటికకు వెళ్లినప్పుడు ఒకరికి ఒకరు అండగా ఉంటామని అక్కడే ప్రమాణం కూడా చేసుకున్నారు. సెప్టెంబర్‌లో నిరాడంబరంగా రిజిష్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకుంటామని బంధువులకు కూడా తెలిపారు. ఇంతలోనే యాక్సిడెంట్ రూపంలో ఘోరం జరిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కష్టకాలంలో తన పక్కన నిలిచిన జెన్సన్‌ను కుడా కాలం తనతో పాటే తీసుకెళ్లింది.
Also Read: 'ఆప్' నాలుగో జాబితా విడుదల, వినేశ్ ఫొగాట్ పొలిటికల్ కుస్తీలో ప్రత్యర్థులు ఫిక్స్
సెప్టెంబర్ 10 మంగళవారం నాడు జెన్సన్, శృతి మరి కొందరు కుటుంబ సభ్యులతో పాటు ఓమ్నీ వ్యాన్‌లో బయలు దేరారు. వారి వాహనం కోజికోడ్- కొల్లేహల్ జాతీయ రహదారిపై మరో ప్రైవేటు వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శృతికి కాబోయే భర్త, చిన్ననాటి స్నేహితుడు జెన్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. శృతితో పాటు వారి బంధువులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీళ్లందరినీ స్థానికుల సాయంతో ఆ రోజు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ జెన్సన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అతడ్ని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేక పోయిందని అధిక రక్తస్రావం కారణంగా అతడ్ని కాపాడలేక పోయామని వైద్యులు వివరించారు. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి నైరాశ్యంలో మిగిలి పోయిన శృతి.. జెన్సన్‌లోనే తన జీవితాన్ని చూసుకుంది. ఇప్పుడు విధి ఆమెకు అతడ్ని కూడా దూరం చేయడంతో మళ్లీ అనాథగా మిగిలింది. జెన్సన్‌ను కోల్పోయిన శృతి.. గుండెలవిసేలా రోదిస్తోంది. శృతికి జరిగిన వరుస నష్టాలపై స్థానికులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మళ్లీ గోడమీదకు చేరిన నితీశ్ కుమార్! తలుపులు తెరిచేది లేదన్న లాలూ