Kerala Lottery: మాములు జాక్‌పాట్ కాదు, రూ.500 టికెట్‌తో రూ.25 కోట్ల లాటరీ - అదృష్టం అంటే ఇదే
Kerala Lottery: తమిళనాడుకు చెందిన ఒక సామాన్యుడు కేరళ ఓనం లాటరీలో జాక్‌పాట్ కొట్టాడు. రూ. 25 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రి కోటీశ్వరుడిగా మారాడు.
Kerala Lottery: అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. ఒక్కొక్కసారి ఊహించని విధంగా లక్ కలిసొస్తూ ఉంటుంది. మన ఊహాలకు కూడా అంతుపట్టని విధంగా అదృష్టం వరిస్తుంది. కొంతమంది డబ్బులు సంపాదించేందుకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తూ ఉంటారు. వర్షం, చలి, ఎండను కూడా లెక్కచేయకుండా డబ్బుల కోసం చాకిరీ చేస్తారు. కానీ కొంతమంది ఎలాంటి కష్టం చేయకపోయినా జాక్‌పాట్ కొట్టి రాత్రికి రాత్రి లక్షాధికారి, కోటీశ్వరులుగా మారుతారు. సామాన్యులు, పేదలు కూడా ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అవుతారు.
తాజాగా ఒక సామాన్య వ్యక్తి చిన్న లాటరీతో జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా లాటరీలో రూ.25 కోట్లు తగలడంతో కోటీశ్వరుడిగా మారాడు. కేరళలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కేరళలో ఓనం సందర్భంగా ప్రతీ ఏడాది అక్కడి ప్రభుత్వం లాటరీలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా మూడు బహుమతులు అందిస్తారు. మొదట బహుమతి రూ.25 కోట్లు, రెండో బహుమతి రూ.కోటి, మూడో బహుమతి రూ.50 వేలు ఇస్తూ ఉంటుంది. లాటరీ టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే కాగా.. ఈ సారి ఏకంగా 90 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇందులో 75 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి.
బుధవారం కేరళ ప్రభుత్వం డ్రా తీయగా.. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన గోకులం నటరాజ్ అనే వ్యక్తి రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. 230662 అనే నెంబర్ గల టికెట్‌ను పాలక్కడ్‌లోని వలయార్ డ్యామ్ సమీపంలోని భవ ఏజెన్సీలో నటరాజ్ కొనుగోలు చేశాడు. లాటరీలో రూ.25 కోట్లు తగలడంతో నటరాజ్ ఎగిరి గంతేస్తున్నాడు. రూ.25 కోట్లలో 30 శాతం ట్యాక్స్ కట్ చేయనుండగా.. రూ.17.5 కోట్లు ఇవ్వనున్నారు. లాటరీలో రూ.కోట్లు గెలుస్తానని తాను అసలు ఊహించలేని, సరదాగా టికెట్ కొనుగోలు చేసినట్లు నటరాజ్ చెబుతున్నాడు. లాటరీలో ప్రథమ బహుమతి గెలుచుకోవంతో తన పంట పడిందని ఫుల్ ఖుషీ అవుతున్నాడు.
అయితే కేరళ ప్రభుత్వం నిర్వహించే లాటరీకి ప్రతీ ఏడాది క్రేజ్ పెరుగుతోంది. గత ఏడాది 11 లక్షల టికెట్లు మత్రమే అమ్ముడుపోగా.. ఈ సారి రికార్డు స్థాయిలో 75 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా పెద్దఎత్తున లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ లాటరీల ద్వారా కొంతమంది రూ కోట్లు గెలుచుకుంటున్నారు. కేవలం రూ.500 టికెట్‌తో రూ.కోట్లు, రూ.లక్షలు గెలుచుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకోవడంతో కేరళ ప్రభుత్వం తీసే లాటరీల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లాటరీ గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో చాలామంది సెర్చ్ చేస్తున్నారు.
10 రోజుల పాటు ఓనం పండుగ
కేరళ ప్రజలకు అతిముఖ్యమైన పండుగ ఓనం. తెలుగువారికి ఉగాది ఎంత ప్రధానమైన పండుగనో.. కేరళ ప్రజలకు ఓనం పండుగ చాలా ముఖ్యమైనది. గత నెలలో ఈ పండుగను కేరళ ప్రజలు జరుపుకున్నారు. దాదాపు 10 రోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు. ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉంటుంది. అలాగే ఒక్కో రోజుని ఒక్కో పేరుతో పిలుస్తారు. తిరు ఓనం, తిరువోనం అనే పేర్లతో కూడా ఈ పండుగను పిలుస్తారు.