Kashmir Grapes: అరుదైన కశ్మీర్ ద్రాక్ష, అంతర్జాతీయ మార్కెట్‌లో అదిరిపోయే డిమాండ్
Kashmir Grapes: అరుదైన రకానికి చెందిన ద్రాక్షను కశ్మీర్ రైతులు పండిస్తున్నారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.
Kashmir Grapes: కశ్మీర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడ పర్యాటక ప్రాంతాలు. అలాగే కశ్మీర్ యాపిల్స్ కు కూడా అంతే ఫేమస్. తెల్లని మంచు, యాపిల్ తోటలతో కశ్మీర్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఈ ప్రాంతంలో కొన్ని రకాల పండ్లు చాలా బాగా దిగుబడిని ఇస్తాయి. అయితే ఒకవైపు యాపిల్ పండ్ల సాగు, దిగుబడి పడిపోయినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి రైతులు యాపిల్ ను కాకుండా ద్రాక్ష పంటపై దృష్టి సారించారు. అరుదైన రకానికి చెందిన ద్రాక్షను పండిస్తున్నారు. ఈ ద్రాక్ష రకం సాధారణ రకానికి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుండటం, మంచి రుచి కలిగి ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది.
కశ్మీర్ లోని గందర్ బాల్ జిల్లాలో రెపోరా అనే గ్రామం ఇప్పుడు ఈ అరుదైన ద్రాక్ష పంటకు ప్రసిద్ధి చెందింది. మారుమూల ఉన్న ఈ కుగ్రామంలో పండుతున్న ద్రాక్షకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ నెలకొంది. గిరాకీ ఎక్కువగా ఉండటంతో ఈ ద్రాక్ష అమ్మకాలు జోరందుకున్నాయి. అత్యుత్తమ నాణ్యతతో పండుతున్న రెపోరా ద్రాక్ష రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది.
సాధారణ ద్రాక్ష చిన్న సైజులో ఉంటాయి. అలాగే రుచిలోనూ సాధారణంగానే ఉంటాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉత్తమ నాణ్యత కలిగిన ద్రాక్ష బరువు 4 నుంచి 5 గ్రాములు ఉండాలి. అయితే రెపోరా గ్రామంలో పండుతున్న ద్రాక్ష బరువు ఏకంగా 12 నుంచి 14 గ్రాముల పరిమాణంలో ఉంటోంది. అంతర్జాతీయ పరిణామాలకు మించి ఉత్తమ నాణ్యతతో ఈ ద్రాక్ష పండ్లు పెరుగుతుండటం, రుచి కూడా బాగుండటంతో అంతర్జాతీయ మార్కెట్ లో వీటికి మంచి గిరాకీ, గుర్తింపు ఏర్పడింది. అత్యుత్తమ నాణ్యతతో పండుతున్న రెపోరా ద్రాక్ష రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సాధారణంగా ఇటలీలో సీజన్ తో సంబంధం లేకుండా ద్రాక్ష దిగుబడి వస్తుంది. ఇప్పుడు కశ్మీర్ లోనూ ఈ రెపోరా ద్రాక్ష సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ లభిస్తోంది.
రెపోరా గ్రామంలో సాహిబీ, అబ్షారీ, హుస్సేనీ అనే మూడు రకాల ద్రాక్ష పండుతోంది. ప్రతి ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు దిగుబడి ఉంటుంది. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కరవక పోవడం వల్ల నెల రోజుల పాటు ద్రాక్ష సాగు ఆలస్యం అయింది. అయినప్పటికీ ప్రస్తుతం మాత్రం దిగుబడి సమృద్ధిగా ఉంది. ప్రపంచ ప్రమాణాలకు మించి నాణ్యమైన పండ్ల పండుతుండటంతో ఇక్కడ ద్రాక్షకు గణనీయమైన డిమాండ్ ఉంటోంది. దీంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
Also Read: Aditya-L1: సూర్యుడిపై నిఘా కోసమే ఆదిత్య-ఎల్1, మానవాళికి ముప్పు తప్పించేందుకేనంటున్న ఇస్రో!
ఈ అరుదైన సాహిబీ, హుస్సేనీ, అబ్షారీ ద్రాక్షలు ప్రస్తుతం 500 హెక్టార్లలో సాగు అవుతోంది. మొత్తం 2 వేల 200 మెట్రిక్ టన్నుల ద్రాక్ష ఉత్పత్తి అవుతోంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి.. అన్ని రకాల పంటలు దెబ్బతింటున్నాయి. రెపోరోలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ద్రాక్ష రైతులకు కలిసి వస్తున్నాయి. ఎప్పుడూ హిమపాతంతో చలిగా ఉండే కశ్మీర్ లో కొన్ని సంవత్సరాలుగా ఉష్ణోగ్రతతలు పెరుగుతుండటం వల్ల ఉద్యాన పంటలకు అనువుగా మారుతోంది. ప్రస్తుతం కశ్మీర్ లో నెలకొన్న వాతావరణం ద్రాక్ష తోటలకు చాలా అనువుగా ఉంటున్నట్లు ఉద్యాన వన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.