Aditya-L1: సూర్యుడిపై నిఘా కోసమే ఆదిత్య-ఎల్1, మానవాళికి ముప్పు తప్పించేందుకేనంటున్న ఇస్రో!
Aditya-L1: సెప్టెంబర్ 2వ తేదీన ఇస్రో ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. దాని విశేషాలు ఏంటంటే..
Aditya-L1: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్షణ పరిశోధన సంస్థ - ఇస్రో.. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆదిత్య-ఎల్1 మిషన్ ను సెప్టెంబర్ 2వ తేదీన చేపట్టబోతున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. సూర్యుని దగ్గరి పరిస్థితులు, సౌర వ్యవస్థ, సౌర తుపానులు, సౌర వాతావరణం లాంటి పరిస్థితులపై ఆదిత్య-ఎల్1 అధ్యయనం చేయనుంది. అయితే ఆదిత్య-ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ ఇస్రోకు అబ్జర్వేటరీగా పని చేయనుంది. ఇప్పటి వరకు ఇస్రో అంతరిక్షంలో ఒక్క అబ్జర్వేటరీని కూడా ఏర్పాటు చేయలేదు. కాగా, ఆదిత్య-ఎల్1 భారత మొదటి అంతరిక్ష అబ్జర్వేటరీ అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మన సౌర వ్యవస్థలో భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడే. దూరంలో ఉన్న వాటికంటే.. దగ్గర్లో ఉన్న వాటిని అధ్యయనం చేయడం సులువు. అలాగే వాటిలో జరిగే మార్పులను, వాతావరణాన్ని నేరుగా వీక్షించవచ్చు, అనుభవించవచ్చు. ఇతర నక్షత్రాల కంటే సూర్యుడిపై చాలా మెరుగ్గా ప్రయోగాలు సాగించవచ్చు. నక్షత్రమైన సూర్యుడిని అధ్యయనం చేస్తే.. ఇతర గెలాక్సీల్లో ఉన్న నక్షత్రాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అనేది ఇస్రో చెబుతున్న మాట.
సూర్యుని నుంచి వచ్చే వేడి, అతినీలలోహిత కిరణాలు, సౌర శక్తి, కరోనల్ మాస్ ఎజెక్షన్, సౌర తుపానులు వంటివన్నీ భూమిపై ప్రభావం చూపిస్తాయి. సూర్యునిలో వచ్చే ఏ చిన్న మార్పు అయినా భూమిపై ప్రభావం చూపిస్తుంది. అందుకే సూర్యుడిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతుండటం చాలా అవసరం. ఇంటర్నెట్ ను అందించే ఉపగ్రహాలు, వాతావరణాన్ని తెలియజేసే శాటిలైట్లు, జీపీఎస్ సేవలను అందంచే ఉపగ్రహాలన్నీ సూర్యుడిలో వచ్చే మార్పులకు ప్రభావితం అవుతాయి. అలాగే సూర్యుడి నుంచి వెలువడే వివిధ ఉష్ణ, అయస్కాంత దృగ్విషయాలు చాలా ప్రమాదకరమైనవి. ఈ కారణాల వల్ల సూర్యునిపై ఎప్పటికీ ఓ కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం. ఆదిత్య- ఎల్1 కూడా అలాంటి నిఘా పనులు చేయనుందని ఇస్రో చెబుతోంది.
175 రోజుల ప్రయాణం..
భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్ -1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్ కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుందిి. లాంగ్రేజియన్ 1 పాయింట్ లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడం వల్ల గ్రహణాల వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారవు.
Also Read: Assam Heavy Floods: మరోసారి వరదలతో వణికిపోతున్న అసోం - 15 మంది మృతి
ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులు, సౌర వ్యవస్థ, సౌర తుపానులు సహా ఇతర పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో ఏడు పేలోడ్స్ ను తీసుకెళ్లనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా(సూర్యుడి బయటి పొర) పై అధ్యయనం చేయడంలో ఉపయోగపడనున్నాయి. పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ సోలార్ మిషన్ కోసం పేలోడ్స్ ను అభివృద్ధి చేశాయి. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించనుంది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని పరిశీలించనున్నాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్ - 1 పాయింట్ వద్ద కణాలు, క్షేత్రాలకు సంబంధించి పరిశీలనలు చేయనున్నాయి.