Karnataka High Court: పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ వివాహిత పిటిషన్, కోర్టు సంచలన వ్యాఖ్యలు
Karnataka High Court: ఓ వ్యక్తి పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ వివాహిత వేసిన పిటిషన్‌ని కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
Karnataka High Court:
కర్ణాటక హైకోర్టు తీర్పు..
కర్ణాటక హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని ఓ వివాహిత కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమెకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. పిటిషనర్‌కి అప్పటికే పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కోర్టుని ఆశ్రయించింది. అయితే...కోర్టు మాత్రం ఆమె పిటిషన్‌ని తిరస్కరించింది. తనపై నమోదు చేసిన పిటిషన్‌ని కొట్టేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్న వ్యక్తికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఎమ్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది.
"ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పిటిషనర్ వాదిస్తున్నారు. కంప్లెయింట్ ఆధారంగా చూస్తే...ఆమెకి అప్పటికే పెళ్లైంది. ఓ కూతురు కూడా ఉంది. ఆమెకి ఇప్పటికే పెళ్లైనప్పుడు మరో వ్యక్తి పెళ్లి చేసుకోలేదని పిటిషన్ వేయడంలో అర్థం ఏముంది..? ఆ వ్యక్తి మోసం చేశాడనడం సరికాదు. అందుకే ఈ పిటిషన్‌ని పరిగణించడం లేదు"
- కోర్టు ధర్మాసనం
ఎవరి వాదన వారిదే..
పిటిషనర్‌పైనా కేసులు నమోదయ్యాయి. ఆమెకి వివాహమైంది. కూతురు పుట్టిన తరవాత భర్త వదిలేసి వెళ్లాడు. వర్క్ ప్లేస్‌లో మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తే తనను మోసం చేశాడని కోర్టు మెట్లెక్కింది. అయితే..ఆ మహిళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతో సాయం చేశానని, తాను ఎప్పుడూ ఆమెని పెళ్లి చేసుకుంటానని మాటివ్వలేదని తేల్చి చెప్పాడా వ్యక్తి. ఒకవేళ ఆమె విడాకులిచ్చి వచ్చినా ఆమె వాదన చెల్లదని స్పష్టం చేశాడు. మలేషియా నుంచి ఇండియాకు రెగ్యులర్‌గా డబ్బులు పంపించానని కోర్టుకి వివరించాడు.
మరో కేసులో ఇలా..
పెళ్లి తర్వాత భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు తన వివాహం పరిపూర్ణం కాలేదంటూ తన భర్త, అత్తమామలపై ఓ మహిళ పెట్టిన క్రిమినల్ కేసును న్యాయస్థానం కొట్టి వేసింది.2020 ఫిబ్రవరిలో ఐసీపీ సెక్షన్ 498ఏ, వరకట్న నిషేధ చట్టం 1961లోని సెక్షన్ 4 కింద భర్త, అత్తామామలపై కేసు పెట్టింది. అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం తన వివాహ బంధం పూర్తి కాలేదని, తన పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది. ఈమె పిటిషన్ ను పరిశీలించిన కుటుంబ న్యాయస్థానం 2022 నవంబర్ లో వీరి వివాహాన్ని రద్దు చేసింది. అయితే అత్తింటి వారిపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు. దీంతో తనపై తన కుటుంబ సభ్యులపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను భర్త.. కర్ణాటక హైకోర్టులో సవాలు చేశాడు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో భర్తపై ఉన్న ఏకైక ఆరోపణ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆయన.. ప్రేమ అంటే కేవలం మనసులకు సంబంధించినది మాత్రమే గానీ.. శారీరక బంధం కాదని విశ్వసించాడని.. దీన్ని తాను కూడా నమ్ముతున్నానని జస్టిస్ ఎం నాగప్రసన్న అంగీకరించారు. అయితే వివాహం చేసుకున్న భార్యతో శారీరక బంధాన్ని నిరాకరించడం, హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వమే అవుతుందని ధర్మాసనం తెలిపింది.