(Source: ECI/ABP News/ABP Majha)
Power Cuts Problem : కరెంట్ లేక..బొగ్గు లేక కాదు.. డబ్బుల్లేక కోతలు ! అసలు నిజాలు ఇవిగో
దేశంలో విద్యుత్ సమస్య ఎందుకొచ్చింది ? బొగ్గు లేదని కొంత మంది .. డిమాండ్ పెరిగిందని మరికొంత మంది చెబుతున్నారు. కానీ అసలు నిజం మాత్రం చెల్లింపులు సంక్షోభం అంటున్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత వేధిస్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. అసలే వేసవి ఆపైన కరెంట్ కోతలు అంటే.. ప్రజలకు ఎంత అసహనంగా ఉంటుందో చెప్పనక్కరలేదు. అదే మూడు నెలల కిందటి వరకూ దేశంలో కరెంట్ పుష్కలంగా ఉండే్ది. కావాల్సినంత ఉండేది. దేశం మొత్తం మిగులు విద్యుత్ ఉందని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడుఎందుకు సమస్య వచ్చిందంటే ఎవరూ ఠక్కున సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వాల నుంచి ఎక్కువగా వస్తున్న సమాధానం బొగ్గు కొరత. కానీ అసలు సమస్య బొగ్గు కొరత కాదని నిధుల సమస్య అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాస్త ప్రణాళికతో వ్యవహరించి ఉంటే.. విద్యుత్ కొరత ఉండేదికాదంటున్నారు.
దేశంలోని అనేక రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కంలు తీవ్రమైన రుణ భారంతో ఉన్నాయి. ఇవన్నీ చెల్లింపుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ కోల్ ఇండియాకు... విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు రూ.12,300 కోట్లు బకాయిలు ఉన్నాయి. అయినా కోల్ ఇండియా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు బొగ్గును అందిస్తోంది.కానీ చెల్లింపులు తక్కువగా ఉండటం కోల్ ఇండియా పనితీరుపై ప్రభావం చూపిస్తోంది. అనుకున్న విధంగా ఉత్పత్తి పెంచలేకపోతోంది.
మరోవైపు జెన్‌కోలు విద్యుత్ ఉత్పత్తి చేసి... వాటిని విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇస్తాయి. డిస్కంలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయాలి. ఇలా విద్యుత్ పంపిణీ సంస్థలకు డిస్కంలు రూ.1.1 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇంత భారీ మొత్తం చెల్లించనప్పటికీ అదే కంపెనీలకు విద్యుత్‌ను విక్రయించాల్సి వస్తోంది. పైగా ఇవి చాలా కాలంగా నష్టాల్లో ఉన్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టం రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నాయి. ఆ విద్యుత్ సబ్సిడీని కంపెనీలకు ప్రభుత్వాలు చెల్లించడం లేదు. ఇది కంపెనీల పనితీరుపై ప్రభావం చూపుతోంది.
చెల్లింపు సంక్షోభం మొత్తం సరఫరా చెయిన్‌పై ప్రభావం చూపుతోంది. బొగ్గు సంక్షోభం లేదా విద్యుత్ సంక్షోభం విద్యుత్ కోతలకు కారణం కాదు. చెల్లింపు సంక్షోభమే దీనికి అసలు కారణమని దీని ద్వారా నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయి 201 గిగావాట్లకు చేరుకుంది. విద్యుత్ డిమాండ్ గతంలో ఎన్నడూ ఈ స్థాయికి చేరుకోలేదు. మే-జూన్‌లో ఇది 215-220 గిగావాట్లకు పెరుగుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అంటే మరికొంత కాలం పాటు కోతలు తప్పవన్నమాట.