IRDAI new Rule: యజమాని వాహనంలో వెళ్లే ఉద్యోగులకూ బీమా కవరేజ్: IRDAI
కంపెనీ యాజమాన్యం వాహనాల్లో ప్రయాణించే ఉద్యోగులకూ బీమా కవరేజ్ లభిస్తోంది. ఉద్యోగుల భద్రతకు.. బీమా సంస్థలు కొత్త రూల్ తెచ్చాయి. ఇండియా మోటార్ టారిఫ్-29 తప్పనిసరిగా అమలు చేయబోతున్నాయి.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. యజమాని వాహనాల్లో ప్రయాణించే ఉద్యోగులకు కూడా తప్పనిసరిగా మోటారు బీమా కవరేజీని అందించాలని బీమా సంస్థలను ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం... కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేట్ కార్ పాలసీని జారీ చేసేటప్పుడు ఉద్యోగులకు ఇన్‌బిల్ట్ కవరేజీగా ఇండియా మోటార్ టారిఫ్-29 (IMT-29)ని తప్పనిసరి చేయాలని ఐఆర్‌డీఏను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. దీని ప్రకారం... బీమా సంస్థలు మార్పులు చేయబోతున్నాయి. IMT-29 నిబంధనలకు అనుగుణంగా... మోటారు బీమా పాలసీల్లో అంతర్భాగంగా అవసరమైన కవరేజీని అందించాలని భావిస్తున్నారు.
IMT-29 కవరేజ్ అంటే ఏంటి?
చాలా కంపెనీలు.. ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. కంపెనీ వాహనాల్లోనే వారిని ఇంటి నుంచి తీసుకురావడం.. ఆఫీసు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర వదిలిపెట్టడం చేస్తుంటాయి. కంపెనీకి సంబంధించిన వాహనాల్లో ప్రయాణించే ఉద్యోగుల భద్రత కోసం... ఇండియా మోటార్ టారిఫ్-29 ఉపయోగపడుతుంది. పనిచేసే సంస్థ వాహనాల్లో ఉద్యోగులు ప్రయాణించే సమయంలో.. ఏదైనా ప్రమాదం జరిగి వారు గాయపడినా.. లేక అకాల మరణం సంభవించినా.. ఇండియా మోటార్ టారిఫ్-29 కింద బీమా కవరేజ్ వస్తుంది. హక్కుదారులు... తమ యజమానుల నుంచి నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉంటుంది.
పనిచేసే సంస్థ లేదా, యజమాని వాహనాల్లో ప్రమాణించే ఉద్యోగులు ప్రమాదాలకు గురైనప్పుడు... నష్టపరిహారం చెల్లించడంలో అనేక సంస్థలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అలాంటి సందర్భంగా... ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత యజమానులపై ఉందని తెలిపింది. సంస్థ లేదా యజమాని వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాల బారిన పడి గాయపడిన ఉద్యోగులు, ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించింది మద్రాస్ హైకోర్టు. ఈ మేరకు... ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ)కు ఆదేశాలు జారీ చేసింది. మోటారు భీమాలో ఉన్న అన్ని బీమా సంస్థలు.. భారతీయ మోటార్ టారిఫ్ IMT-29ను తప్పనిసరి చేయాలని ఆదేశించింది.
మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం... ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ)... అన్ని బీమా సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రైవేట్ కార్ పాలసీలను జారీ చేసే సమయంలో... ఉద్యోగులకు ఇన్‌బిల్ట్ కవరేజీగా ఇండియా మోటార్ టారిఫ్-29 (IMT-29)ని తప్పనిసరి చేయాలని తెలిపింది. అంతేకాదు... తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ఇండియా మోటార్ టారిఫ్-29 కవరేజీకి అదనపు ప్రీమియం వసూలు చేయరాదని కూడా తన సర్క్యులర్‌లో పేర్కొంది.