Indigo ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా విధించిన DGCA.. రూ.50 కోట్ల డిపాజిట్‌కు సైతం ఆదేశాలు
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏర్పాటైన నలుగురు సభ్యుల విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఇండిగో విమాన సంస్థ మీద డీజీసీఏ చర్యలు చేపట్టింది. ఇండిగోకు 22 కోట్ల జరిమానా విధించింది.

న్యూఢిల్లీ: డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ఆలస్యానికి సంబంధించి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై కఠిన చర్యలు తీసుకుంది. విచారణ అనంతరం DGCA ఇండిగోపై మొత్తం రూ. 22.20 కోట్ల జరిమానా విధించింది. సీనియర్ అధికారులను సైతం హెచ్చరించింది. 50 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని డిపాజిట్ చేయాలని సంస్థను ఆదేశించింది. అలాగే ప్రయాణికులకు నష్టపరిహారం, కంపెనీ మొత్తం ఆపరేషనల్ సిస్టమ్‌ను మెరుగుపరచాలని కఠినమైన సూచనలు చేసింది.
DGCA నివేదిక ప్రకారం, డిసెంబర్ 3 నుంచి 5, 2025 మధ్య ఇండిగోకు చెందిన 2,507 విమానాలు రద్దయ్యాయి. 1,852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీని కారణంగా 3 లక్షలకు పైగా ప్రయాణికులు వివిధ విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల విచారణ కమిటీ నెట్‌వర్క్ ప్లానింగ్, సిబ్బంది రోస్టర్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, నిర్వహణ ఫ్రేమ్‌వర్క్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది.
విచారణలో ఏం వెల్లడైంది?
ఇండిగో కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (FDTL) నిబంధనలను సరిగ్గా అమలు చేయలేదని కమిటీ విచారణలో తేలింది. సిబ్బంది రోస్టర్‌లు తగినంత విశ్రాంతి సమయం లేకుండా రూపొందించారు. రికవరీ మార్జిన్ చాలా తక్కువగా ఉంచారు. విమానాలు, సిబ్బందిని ఎక్కువగా ఉపయోగించారు. దీనివల్ల ఆపరేషనల్ బఫర్ ముగిసింది. సంస్థ చిన్న లోపం కూడా పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేయడానికి, ఆలస్యం కావడానికి కారణమైంది.
లాభాలను పెంచడం, వనరులను గరిష్టంగా ఉపయోగించడంపై ఎక్కువ దృష్టి పెట్టిన కారణంగా భద్రత, నియంత్రణ సన్నద్ధత బలహీనపడిందని కమిటీ గుర్తించింది. సాఫ్ట్‌వేర్, సిస్టమ్ సపోర్ట్ లోపాల కారణంగా రోస్టర్‌లు, నెట్‌వర్క్‌ను నిర్వహించడం కష్టతరంగా మారింది. నిర్వహణ స్థాయిలో సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు.
DGCA ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సీనియర్ అధికారులపై కూడా చర్యలు తీసుకుంది. CEO మొత్తం ఆపరేషన్, సంక్షోభ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అకౌంటబుల్ మేనేజర్ అంటే COO, శీతాకాలపు షెడ్యూల్, సవరించిన FDTL నిబంధనల ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమవడంతో హెచ్చరిక జారీ చేసింది. డిప్యూటీ హెడ్ ఫ్లైట్ ఆపరేషన్స్, సిబ్బంది వనరుల ప్రణాళికకు చెందిన AVP, డైరెక్టర్ ఫ్లైట్ ఆపరేషన్స్‌ను కూడా హ్యూమర్ రీసోర్స్ ప్లాన్, రోస్టర్ నిర్వహణ, పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని హెచ్చరించారు.
ఇండిగోను చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశాలు
ఇండిగోను అంతర్గత విచారణలో ఇతర అధికారుల పాత్ర వెల్లడైతే వారిపై కూడా చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని DGCA ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు DGCA ఇండిగోపై రోజుకు 30 లక్షల రూపాయల చొప్పున 68 రోజుల పెనాల్టీ విధించింది. ఇది మొత్తం 20.40 కోట్ల రూపాయలు. సిస్టమ్‌కు సంబంధించిన లోపాలపై రూ. 1.80 కోట్లు జరిమానా విధించారు. దాంతో మొత్తం జరిమానా రూ. 22.20 కోట్లు అయింది.
50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఆదేశం
డీజీసీఏ చర్యలు జరిమానాలకు మాత్రమే పరిమితం కాలేదు. DGCA ఇండిగోను 50 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీనిని ‘ఇండిగో సిస్టమిక్ రిఫార్మ్ అస్యూరెన్స్ స్కీమ్’ కింద ఉంచుతారు. నాయకత్వం పాలన, సిబ్బంది ప్రణాళిక, అలసట నిర్వహణ, డిజిటల్ సిస్టమ్‌ల బలం, బోర్డు స్థాయి పర్యవేక్షణ వంటి 4 సంస్కరణలు పూర్తిగా అమలు చేస్తున్నారని ధృవీకరించే వరకు ఈ గ్యారంటీని దశలవారీగా విడుదల చేయరు.
డిసెంబర్ 3 నుండి 5 మధ్య మూడు గంటలకు పైగా ఆలస్యమైన లేదా రద్దు చేసిన విమానాలకు, నిబంధనల ప్రకారం రీఫండ్, నష్టపరిహారంతో పాటు 10,000 రూపాయల ‘గెస్టర్ ఆఫ్ కేర్’ వోచర్ ఇవ్వాలని DGCA పేర్కొంది. ఆ వోచర్ చెల్లుబాటు 12 నెలలు.
భద్రత, నిబంధనల అమలు
DGCA తన ప్రకటనలో పౌర విమానయానంలో భద్రత, నిబంధనల అమలు అత్యున్నతమని స్పష్టం చేసింది. లాభాలు లేదా ఆపరేషనల్ ఒత్తిడి పేరుతో సిబ్బంది అలసట, రోస్టర్ నిబంధనలు, భద్రతా ప్రమాణాలలో రాజీపడటాన్ని సహించదు. ఈ చర్య కేవలం శిక్ష మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థను మెరుగుపరచడానికి, భవిష్యత్తులో ఇలాంటి పెద్ద సమస్య రిపీట్ కాకుండా చూసుకోవడానికి తీసుకున్న చర్యగా డీజీసీఏ పేర్కొంది.

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (IndiGo) చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మెస్సేజ్
‘2025 డిసెంబర్ ఆరంభంలో ఇండిగో విమాన సర్వీసుల నిర్వహణలో తలెత్తిన భారీ అంతరాయాల ఘటనలకు సంబంధించి, భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) జారీ చేసిన ఉత్తర్వులను మేం అందుకున్నాము’ అని ఇండిగో సంస్థ స్పందించింది.
ఈ సందర్భంగా మా వాటాదారులందరికీ, ముఖ్యంగా మా వినియోగదారులకు మేం తెలియజేయాలనుకున్నది ఏంటంటే.. ఇండిగో బోర్డు, యాజమాన్యం ఈ ఉత్తర్వులను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో అత్యంత ఆలోచనాత్మకంగా, తగిన సమయంలో సరైన చర్యలు చేపట్టేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
గత 19 ఏళ్లకు పైగా ఎంతో నిబద్ధతతో సాగుతున్న మా ప్రయాణంలో ఎదురైన ఈ అంతరాయం నుండి మరింత బలంగా తిరిగి రావాలనే లక్ష్యంతో, ఇండిగోలోని అంతర్గత ప్రక్రియల పటిష్టతపై ఇప్పటికే లోతైన సమీక్ష కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా వ్యవస్థలను మరింత దృఢంగా తీర్చిదిద్దుతున్నాం. భారతదేశ ప్రజల అవసరాలకు నిరంతరం సేవలు అందించడానికి ఇండిగో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 2030 నాటికి మన దేశం ప్రపంచ విమానయాన రంగంలో ఒక ప్రధాన శక్తిగా ఎదగడంలో మా వంతు వినమ్రపూర్వకమైన పాత్రను పోషించడానికి మేం కట్టుబడి ఉన్నామని’ ఇండిగో సంస్థ ప్రకటనలో పేర్కొంది.





















