Indigo Crisis Action: ఇండిగో సంక్షోభంపై చర్యలు చేపట్టిన DGCA.. నలుగురిపై సస్పెన్షన్ వేటు
DGCA action against Indigo Crisis | ఇండిగో విమానయాన సంస్థ పనితీరుపై దర్యాప్తులో భాగంగా DGCA నలుగురు ఫ్లైట్ ఇన్స్పెక్టర్లను తొలగించింది. వీరి నిర్లక్ష్యం వల్లే సంక్షోభం తలెత్తినట్లు గుర్తించింది.

Indigo Airlines Crisis: గత కొన్ని రోజులుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రాథమిక విచారణలో చర్యలు చేపట్టింది. విచారణలో కొంతమంది ఇన్‌స్పెక్టర్లు దోషులుగా తేలడంతో, ఇండిగోను పర్యవేక్షించే నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్లను DGCA తొలగించింది.
ఈ ఇన్‌స్పెక్టర్లందరూ ఇండిగో విమానాల భద్రత, నిర్వహణను పరిశీలించే పని చేస్తున్నారు. తనిఖీ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా DGCA ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యలు తీసుకున్న అధికారులు అందరూ DGCAలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారని సమాచారం. ఎయిర్‌లైన్స్, ముఖ్యంగా ఇండిగో సేఫ్టీ, ఆపరేషనల్ ఓవర్‌సైట్‌ను పర్యవేక్షించే బాధ్యతల్ని వీరు నిర్వర్తిస్తున్నారు.
విమానాశ్రయాలలో గందరగోళంపై హైకోర్టు ఆగ్రహం
విమాన సర్వీసుల అంతరాయం, విమానాశ్రయంలో ప్రయాణీకుల ఇబ్బందులపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంతో పాటు DGCAని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని, ప్రయాణికులకు సహాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు ఇటీవల ప్రశ్నించింది. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను చూసుకోవడానికి, వారి ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలపాలని కోర్టు వారికి నోటీసులు ఇచ్చింది.
ఈ సమస్య కేవలం ప్రయాణీకుల ఇబ్బందులకు మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో ఆర్థిక నష్టం, వ్యవస్థ వైఫల్యం ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రయాణికులకు పరిహారం చెల్లించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బంది బాధ్యతను నిర్ధారించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.
విమాన ఛార్జీల పెరుగుదలపై కోర్టు ఆగ్రహం
దేశంలో అత్యధిక సర్వీసులు అందించే ఇండిగో ఎయిర్‌లైన్స్ పలు విమానాలు రద్దు చేయడంతో విమాన టికెట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. పెరిగిన విమాన టికెట్ ధరలపై కూడా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. గతంలో ₹5,000లకు లభించే టిక్కెట్లు, ఇప్పుడు ₹30,000 –35,000లకు ఎలా పెరిగాయని ప్రశ్నించింది. సంక్షోభ సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్‌కు ఇంత లాభం ఎలా లభించిందని ధర్మాసనం కేంద్రం, డీజీసీఏలను ప్రశ్నించింది. ఇంత ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం ఎలా సాధ్యం, ఇది కరేక్టేనా అని ప్రశ్నించింది.
దీనికి సమాధానంగా, ASG చేతన్ శర్మ మాట్లాడుతూ, పూర్తి చట్టపరమైన వ్యవస్థ అమలులో ఉందన్నారు. కేంద్రం చాలా కాలం నుంచి FDTLని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే ఇండిగో ఎయిర్‌లైన్ జూలై, నవంబర్ ఫేజ్ కోసం ఉపశమనం కోరిందన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఛార్జీలకు పరిమితి విధించడం ఇదే మొదటిసారి అని, ఇది ఒక కఠినమైన నియంత్రణ చర్య అని అన్నారు.






















