Indias Population: రాబోయే 10 ఏళ్లలో భారత్ జనాభా పరిస్థితి ఎలా ఉండనుంది? ప్రభుత్వాలు ఏం చేయనున్నాయి?
Indias Population: చైనాను దాటి జనాభాలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది భారత్. రాబోయే 10 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Indias Population: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్. మొన్నటి వరకు చైనా పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. చైనాను వెనక్కి నెట్టి మరీ జనాభాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2030 నాటికి భారత దేశ జనాభా 1.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అంటే 160 కోట్లకు పైగా చేరుకుంటుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2020 లో 1.3 బిలియన్లు గా ఉన్న జనాభా.. నానాటికీ గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నాయి. విపరీతమైన జనాభా పెరుగుదల వల్ల సహజ వనరులపై, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరగనుంది.
జాతీయ కమిషన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రచురించిన టెక్నికల్ గ్రూప్ నివేదిక ప్రకారం.. జులై 1, 2023 నాటికి జనాభా అంచనా 139.23 కోట్లు అని లోక్‌సభలో కేంద్ర సర్కారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. కరోనా కారణంగా 2021 జనాభా లెక్కలు నిర్వహించలేదని చెప్పుకొచ్చారు. అలాగే 2023 నాటికి భారత్ లో ముస్లిం జనాభా 20 కోట్లకు చేరుకున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ఇటీవల, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో మాట్లాడుతూ 2023 నాటికి భారత్ లో ముస్లిం జనాభా 19.7 కోట్లు ఉంటుందని అంచనా అని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు 14.2 శాతం ఉన్నారు. 2023 అంచనా ప్రకారం ముస్లింల జనాభా 19.7 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు.
జనాభా పెరుగుదల సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనాభా పెరుగుదలపై ప్రభుత్వాలు ఏం చేయనున్నాయి.. ఏం చేస్తే జనాభాను నియంత్రించవచ్చు.. అనే ఇతర అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.
జనాభా పెరుగుదల సవాళ్లు
భారతదేశ జనాభా పెరుగుదల వనరులు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి తీసుకువస్తుంది. దేశం ఇప్పటికే నీరు, ఆహారం, ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. జనాభా పెరిగేకొద్దీ, ఈ కొరత మరింత తీవ్రం అవుతుంది. జనాభా పెరుగుదల పర్యావరణంపైనా ఒత్తిడి తెస్తుంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఒకటి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే పెరుగుతున్న జనాభా డిమాండ్ లను కొనసాగించడం సవాలుగా ఉంది.
జనాభా నియంత్రణ ప్రయోజనాలు
జనాభా పెరుగుదల సవాళ్లను పరిష్కరించడానికి జనాభా నియంత్రణే కీలకం. జనాభాను తగ్గించడం ద్వారా, వనరులను పరిరక్షించడానికి, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, భారతదేశానికి మరింత స్థిరమైన భవిష్యత్తును రూపొందించడానికి ప్రభుత్వ చర్యలు కీలకం కానున్నాయి. జనాభా నియంత్రణ వల్ల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. కుటుంబంలో తక్కువ మంది ఉంటే.. వారి జీవన నాణ్యత, పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణ, అవసరాలు తీర్చడం, సౌకర్యాలు కల్పించడం వంటివి సులభమవుతాయి.
Also Read: Armed Forces: 10 ఏళ్లలో రక్షణ రంగంలో ఎలాంటి అభివృద్ధి జరగొచ్చు? భారత్‌కు ఉన్న అవకాశాలేంటి?
2030 నాటికి ప్రతి స్త్రీకి 2.2 పిల్లల సంతానోత్పత్తి రేటును 2.1 కి తగ్గించడం ప్రభుత్వ జనాభా విధానాల్లో ముఖ్య లక్ష్యం. కుటుంబ నియంత్రణ విద్య, గర్భనిరోధకం, మహిళల ఆర్థిక సాధికారత వంటి చర్యల వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. జనాభా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, సంతానోత్పత్తి రేటును తగ్గించడానికి అవసరమైన విద్య, ఆరోగ్య సంరక్షణలో కూడా ప్రభుత్వం కేటాయింపులు జరుపుతోంది. విద్య, ఉపాధికి మెరుగైన అవకాశాలను అందించడం ద్వారా చిన్న కుటుంబాలను ప్రోత్సహించాలని, చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం అనేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
సంతానోత్పత్తి రేటు తగ్గించడానికి, విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా దేశ ప్రజలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వొచ్చు అన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.