Train Fare Hike: టికెట్ ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ.. డిసెంబర్ 26 నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు
Indian Railways hike train fare | భారత్‌లో రైలు ఛార్జీల పెంపు 26 డిసెంబర్ నుండి అమలులోకి వస్తుంది. ఇది సుదూర ప్రయాణాలు చేసే వారిని ప్రభావితం చేస్తుంది.

Train Fare Hike | దేశంలో ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే తక్కువ ధర, అధిక సౌకర్యవంతమైనది. రైల్వేను సామాన్యుల వాహనంగా పరిగణిస్తారు. కానీ రైల్వే శాఖ తమ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారతీయ రైల్వే రైలు ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది సుదూర ప్రయాణాలు చేసేవారిపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. రైల్వే ప్రకారం డిసెంబర్ 26 నుండి రైళ్ల ఛార్జీలలో మార్పులు అమలు కానున్నాయి.
ఈ నిర్ణయం తర్వాత, అనేక మార్గాలలో ప్రయాణాలు గతంలో కంటే ఖరీదైనది కావచ్చు. అయితే, రైల్వే చిన్న దూర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 215 కిలోమీటర్ల వరకు జర్నీకి ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది. అంటే, రోజువారీ ప్రయాణికులకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సుదూర ప్రయాణాలు చేసే వారి ఖర్చు పెరుగుతుంది. కానీ కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే తక్కువ దూరం ప్రయాణం చేసేవారికి ఛార్జీలు పెరగలేదు. సుదూర ప్రయాణాలు చేసేవారికి సైతం నామ మాత్రం ఛార్జీలు పెంచారు.
సుదూర ప్రయాణాలకు ఛార్జీల పెంపు ఎంత?
రైల్వే ఛార్జీల పెంపుపై శాఖ కీలక ప్రకటన చేసింది. ఛార్జీల పెంపు 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ కేటగిరీలో ఇప్పుడు ప్రతి కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాలి. అయితే, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ఏసీ కేటగిరీలలో ఈ పెంపు కిలోమీటరుకు 2 పైసలు ఉంటుంది. ఉదాహరణకు 1000 కిలోమీటర్ల ప్రయాణం విషయానికి వస్తే.. ఆ మార్గంలో నాన్-ఏసీ రైలులో ప్రయాణించే ప్రయాణికులు సుమారు 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్ ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి సుమారు 20 రూపాయలు ఎక్కువగా చెల్లించాలి. మొత్తంగా చూస్తే, ప్రయాణికుల జేబులపై పెద్దగా భారం మోపలేదు. కానీ గతంలో కంటే టికెట్ కోసం కొంచె ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. కానీ స్వల్ప పెరుగుదల కూడా సామాన్యులపై కొంచెం ప్రభావం చూపుతుంది.
ఈ ప్రయాణికులకు అదనపు ఛార్జీలు ఉండవు
రైల్వే ఛార్జీల పెంపుతో పాటు ప్రయాణికులకు ఉపశమనం కూడా ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, సాధారణ కేటగిరీలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరని స్పష్టం చేసింది. ఇది రోజువారీ రైలు ప్రయాణికులకు, చిన్న దూర ప్రయాణికులపై ప్రభావం చూపదు. ఆఫీసు, చదువు కోసం లేదా చిన్న పట్టణాల మధ్య రాకపోకలు చేసేవారిపై టికెట్ ఛార్జీల పెంపు ప్రభావం ఉండదు.
గడిచిన పదేళ్లలో రైల్వే తన నెట్‌వర్క్‌ను, మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించింది. మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఖర్చులు 1,15,000 కోట్ల రూపాయల మేర పెరిగాయి. పెన్షన్ల కోసం చేసే ఖర్చు కూడా 60 వేల కోట్లకు చేరింది. మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే నిర్వహణ వ్యయం 2,63,000 కోట్లకు చేరుకుంది. ఇటీవల దీపావళి, ఇతర పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే 12,000 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడిపినట్లు గుర్తు చేసింది.
ఏడాదిలో రెండోసారి ధరల పెంపు
2025లో రైల్వేశాఖ ఛార్జీలను పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్ నెలలో ధరల పెంపు నిర్ణయం తీసుకోగా, జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చాయి. ఆ నిర్ణయం జరిగిన 5 నెలల వ్యవధిలోనే రైల్వే మరోసారి ప్రయాణ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల పెంపు ద్వారా ఈ ఏడాది రైల్వేకు అదనంగా 600 కోట్ల ఆదాయం సమకూరనుంది. కొత్త నిబంధనల ప్రకారం, 500 కిలోమీటర్ల లోపు ప్రయాణించే నాన్-ఏసీ కోచ్ ప్రయాణికులు ఇప్పుడు అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.






















