India Covid19 Cases: దేశంలో తాజాగా 12 మంది మృతి, కొవిడ్ మరణాలతో పెరుగుతున్న ఆందోళన
India Corona Cases: దేశంలో కొవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరగడంతో మరణాలు అదే స్థాయిలో సంభవిస్తున్నాయి.
Covid-19 Deaths In India : దేశంలో కొవిడ్ ( Covid -19 ) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఊహించని విధంగా వైరస్ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 761 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరగడంతో మరణాలు (Covid19 Deaths) అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. కొవిడ్ ఉపరకం జె.ఎన్.1 వెలుగు చూసిన తర్వాత డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చలితీవ్రత పెరగడంతో కొవిడ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది.
కొత్త వేరియంట్ కేసులు పది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. కొత్తగా 12 మంది ప్రాణాలు కోల్పోవడం కలవరపాటుకు గురి చేస్తోంది. రళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గడం శుభపరిణామం. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,423 నుంచి 4,334కి తగ్గాయి. కేరళలో అత్యధికంగా 1,249 క్రియాశీల కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 1,240, మహారాష్ట్రలో 914, తమిళనాడులో 190, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో 128 చొప్పున ఉన్నాయి.
మిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1 లక్షణాలు
జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి మిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1 లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. న్యుమోనియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలోనూ కొవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు ఉంటున్నాయి. న్యుమోనియా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో వచ్చే పిల్లలందరికీ కరోనా పరీక్షలూ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా న్యుమోనియా సోకుతోందని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పండుగల వేళ వైరస్ పై అప్రమత్తం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి. సాధారణంగా కొవిడ్-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చు. అయితే ఈ వేరియంట్ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదు. ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్ టెస్టుల ద్వారా జేఎన్.1 వేరియంట్‌ను కనిపెట్టవచ్చు.
వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్, సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలి. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి.