అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై భారత్ ఆందోళన
ఇజ్రాయెల్, హమాస్ వార్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్, హమాస్ వార్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహిరంగ చర్చ సందర్బంగా రవీంద్ర ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్ లో జరిగిన దాడులు దిగ్బ్రాంతిని కలిగించాయన్న ఆయన, హమాస్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ పై ఉగ్రవాదులు చేసిన దాడులను ప్రధాన మంత్రి మోడీ సైతం ఖండించారని గుర్తు చేశారు.
38 టన్నుల విపత్తు సహాయక సామాగ్రి
గాజా స్ట్రిప్ లోని ప్రజలకు మానవతా సాయం చేయడంలో ఇండియా కూడా ముందుందన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ముగిసేలా ప్రపంచ దేశాలు పాటు ఆర్ రవీంద్ర కోరారు. ఇజ్రాయెల్ కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తున్నాయని గుర్తు చేశారు. గాజాలో బాధితుల కోసం 6.5 టన్నుల వైద్య, 38 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని భారత్ పంపిందన్నారు యుఎన్ లోని భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర. భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానం వాటిని ఈజిప్టులోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి చేర్చిందని, అక్కడి నుంచి గాజా స్ట్రిప్ లోని ప్రజలకు అందిస్తోందన్నారు. ఇందులో ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్స్, శానిటరీ వస్తువులు, నీటిని శుద్ధి చేసే ట్యాబ్లెట్లు ఉన్నాయన్నారు.
ఆస్పత్రుల్లో కమ్ముకున్న చీకట్లు
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న బాంబుదాడుల్లో పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. విద్యుత్ సరఫరా కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. వివిధ ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల ఆరోగ్యంపై ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే అనేక మంది శిశువులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆవేదన చెందుతున్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ విభాగానికి అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే భారీ విపత్తు ఎదురవుతుందని గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గాజాస్ట్రిప్ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఇంక్యుబేటర్లలో మొత్తంగా 130 మంది శిశువులు ఉన్నారు. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
యుద్దానికి విరామమిస్తే హమాస్ కే లాభమన్న అమెరికా
యుద్ధాన్ని ఆపి వేయాలంటూ యూరోపియన్ యూనియన్ పిలుపును అమెరికా వ్యతిరేకించింది. యుద్ధానికి విరామం ఇవ్వడం వల్ల హమాస్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించింది. యుద్ధాన్ని ఆపడం వల్ల హమాస్‌కి విరామం లభిస్తుందని, బలం పుంజుకొని తిరిగి ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది. దారుణమైన ఉగ్రదాడుల్ని ఎదుర్కొంటోన్న ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపలేని పరిస్థితిలో ఉందన్నారు.