India BF.7 Cases: చైనా నుంచి భారత్‌కు వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్, కుటుంబసభ్యులకు కరోనా టెస్టులు
కొత్త వేరియంట్ బీఎఫ్ 7 పాజిటివ్ కేసులు భారత్ లోనూ నమోదవుతున్నాయి. రెండు రోజుల కిందట చైనా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి తాజాగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
Agra man who returned from China tests positive for Covid-19: చైనాలో గత వేరియంట్ల కంటే చాలా వేగంతో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ బీఎఫ్ 7 పాజిటివ్ కేసులు భారత్ లోనూ నమోదవుతున్నాయి. రెండు రోజుల కిందట చైనా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి తాజాగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రమాదకర వేరియంట్ బీఎఫ్ 7 నిర్ధారణ కోసం అతడి శాంపిల్స్‌ను లక్నోలోని జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 23 న చైనా నుంచి ఆగ్రాకు ఆ వ్యక్తి వచ్చారు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నాడు. వ్యాపారం నిమిత్తం 40 ఏళ్ల ఆగ్రా వ్యక్తి చైనాకు వెళ్లి వచ్చారు. రెండు రోజుల కిందట శాంపిల్స్ టెస్టులకు పంపించగా తాజాగా కోవిడ్ 19 పాజిటివ్ అని అధికారులు తెలిపారు. అతడిని కలిసిన వారిని, ప్రైమరీ కాంటాక్ట్స్ తో పాటు కుటుంబసభ్యులు అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించడానికి మెడికల్ టీమ్ లను పంపినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు.
చైనాను వణికిస్తున్న బీఎఫ్ 7 వేరియంట్ కేసులు దేశంలోనూ నమోదయ్యాయి. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ మరియు అమెరికాతో సహా దేశాల్లో కరోనా సంఖ్య పెరుగుతోంది. చైనాలో కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లో ముగ్గురికి, ఒడిశాలో ఒకరికి BF.7 కరోనా వేరియంట్ ఇదివరకే నిర్ధారణ అయింది. దేశంలో బీఎఫ్7 పాజిటివ్ కేసులు రావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారందరికీ RT-PCR పరీక్షను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా...పాజిటివ్ అని తేలినా వెంటనే క్వారంటైన్ చేయాలని స్పష్టం చేశారు. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్లు తప్పనిసరిగా Air Suvidh ఫామ్‌లలో ప్రస్తుత ఆరోగ్య స్థితికి సంబంధించిన అన్ని వివరాలు తెలియ జేయాలని కేంద్రం వెల్లడించింది.
కరోనా జాగ్రత్తల్లో భాగంగా కేంద్రఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ శనివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై యుద్ధానికి మరోసారి సిద్ధమయ్యాయి. ఈక్రమంలోనే అధికారులతో సమావేశం నిర్వహించిన ఆరోగ్య మంత్రి కీలక ఆదేశాలిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు పలు సూచనలు చేశారు. కరోనా మార్గదర్శకాలు విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలకూ లేఖ కూడా రాశారు. రానున్న రోజుల్లో పండుగలు వస్తున్నందున అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో పాటు కరోనా పరీక్షల సంఖ్యనూ పెంచాలని చెప్పారు. టెస్టింగ్, ట్రీట్‌మెంట్, ట్రేసింగ్ ఫార్ములాను మరోసారి అనుసరించాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ ప్రికాషన్ డోస్ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం సహా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు.