Gujarat Congress : గుజరాత్ కాంగ్రెస్‌లో హార్దిక్ కల్లోలం - పార్టీ మారబోవడం లేదన్న పటేల్ నేత !
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. హార్దిక్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయనపార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.కానీ హార్దిక్ ఖండించారు.
గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ పటేల్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తనను పట్టించుకోవడం లేదని, పార్టీని వీడాలని వేధిస్తున్నారని అన్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి ఎన్నో సార్లు రాహుల్‌కి చెప్పానని, కానీ ఆయన పట్టిచుకోవడం లేదని.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అది తనకు బాధ కలిగించిందని మీడియాతో అన్నారు. 2015లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ పాటిదార్ కమ్యూనిటీ కారణంగానే కాంగ్రెస్ కొన్ని స్థానాలను గెలుచుకోగలిగిందని, అయినప్పటికీ తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
అయితే ఈ ప్రచారాన్ని హార్థిక్ పటేల్ శుక్రవారం ఖండించారు. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. గుజరాత్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ నేతలంతా సమైక్యంగా కృషి చేస్తామని అన్నారు. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్లు వదంతులు వస్తున్నాయని, ఇలా ఎవరు ప్రచారం చేస్తున్నారో తనకు తెలియదని అన్నారు. ఇప్పటి వరకు తాను పార్టీ కోసం 100 శాతం శ్రమించాను, ఇకపై కూడా అదేవిధంగా శ్రమిస్తానని అన్నారు. పార్టీలో చిన్న చిన్న కొట్లాటలు, ఒకరిపై మరొకరు నిందారోపణలు చేయడం సాధారణమేనని, అయితే గుజరాత్‌ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు.
''నిజం చెప్పడం పలకడం నేరమైనట్లయితే, నన్ను అపరాధిగా పరిగణించండి'' అని సెటైరిక్‌గా తాను కాంగ్రెస్‌లో ఎదుర్కొంటున్న పరిస్థితులపై చేసిన ప్రకటనపై స్పందించారు. ప్రజలు మన నుండి కొన్నింటిని ఆశిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలకు మనం మద్దతుగా నిలవాలని చెప్పారు. 2015లో పాటిదార్‌ల కోసం ఆందోళన చేపట్టిన ఆయన 2019లో కాంగ్రెస్‌లో చేరారు.
మరికొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హార్జిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో సహజంగానే కలకలం రేపాయి.
గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారం చేపట్టి దశాబ్దాలు దాటిపోయింది. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి గట్టి నేత లేకుండా పోయారు . బీజేపీ ఓటు బ్యాంక్ లాంటి పాటిదార్ల నుంచి వచ్చిన హార్జిక్ పటేల్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాస్త ఊపు కనిపించింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ మార్క్ వివాదాలు బయటకు వస్తున్నాయి. వీటిని రాహుల్ గాంధీ ఎలా సర్దుబాటు చేసి ఎన్నికలకు పార్టీని రెడీ చేస్తారో చూడాలి.