GST Council Meeting: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ - జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు
ఆన్ లైన్ గేమింగ్, కాసినోలపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ తాము తీసుకున్న నిర్ణయం ఏ ఒక్క పరిశ్రమను కానీ ఉద్దేశిస్తూ తీసుకోలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను విధింపుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలు నిర్వహించే సంస్థలు తమ టర్నోవర్ పై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. జీఎస్టీ చట్టంలో సవరణ తర్వాత ఈ నియమం అమల్లోకి రానుంది. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు లేదా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆన్ లైన్ గేమింగ్, కాసినోలపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ తాము తీసుకున్న నిర్ణయం ఏ ఒక్క పరిశ్రమను కానీ ఉద్దేశిస్తూ తీసుకోలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నిర్ణయాలు జీఎస్టీ కౌన్సిల్ లోని సభ్యులు అందరి అంగీకారం ప్రకారమే తీసుకున్నామని చెప్పారు. క్యాసినో అనుమతులు ఉన్న గోవా, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధుల నుంచి కూడా అభిప్రాయం తీసుకున్నామని చెప్పారు.
మరోవైపు, సినిమా టిక్కెట్లతో పాటు థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింకులు వంటి తినుబండారాలపై విధించే జీఎస్టీ విషయంలోనూ జీఎస్టీ కౌన్సిల్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ వస్తువులన్నీ మిశ్రమ సరఫరాగా పరిగణిస్తామని, ప్రిన్సిపల్ సప్లై అంటే సినిమా టిక్కెట్‌కి సమానంగా పన్ను విధిస్తామని తెలిపారు.