Currency Ganesh In Bangalore : ఈ వినాయకుడి డెకరేషన్ చూస్తే ఔరా అనాల్సిందే !
Currency Ganesh In Bangalore : దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల సందడి మొదలైంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా పండుగను ఘనంగా చేపట్టారు.
Currency Ganesh In Bangalore : దేశ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల సందడి మొదలైంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా పండుగను ఘనంగా చేపట్టారు. కొందరు పూలు, పండ్లతో ప్రత్యేకంగా మండపాలను అలంకరిస్తుంటే.. మరికొందరు కూరగాయలతో గణపతి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. కర్ణాటకలో ఏకంగా కరెన్సీ నోట్లతోనే వినాయకుడి ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. బెంగళూరులోని పుట్టెన్హళ్లి జేపీ నగర్‌లోని శ్రీ సత్య గణపతి ఆలయాన్ని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇందుకోసం రూ.2.06 కోట్లు విలువ చేసే నోట్లను ఉపయోగించారు. రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను దండల రూపంలో అమర్చి ఆలయం లోపల అలంకరించారు.
#WATCH | Bengaluru: Sri Sathya Ganapathi Temple in Puttenahalli, JP Nagar has adorned its premises with Indian currency notes and coins. The decorations include Rs 500, Rs 200, Rs 100, Rs 50, Rs 20 and Rs 10 notes along with coins. pic.twitter.com/7LE65GRxAY
— ANI (@ANI) September 18, 2023
అలాగే రూ.52.50 లక్షలు విలువ చేసే నాణేలను వినియోగించారు. నాణేలతో ఆలయంలో ఏర్పాటు చేసిన చంద్రయాన్-3, విక్రమ్ ల్యాండర్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో అన్ని రకాల నాణేలను ఆలయ అలంకారానికి ఉపయోగించారు. మండపాన్ని కరెన్సీతో తీర్చిదిద్దేందుకు మొత్తం 150 మంది భక్తులు గతనెల రోజులుగా కష్టపడ్డారు. ఈ ప్రత్యేక అలంకరణ ఆలయానికి వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గత 11 ఏళ్లుగా ఆలయంలోని వినాయకుడిని పండగ వేళ వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి కాస్త వినూత్నంగా ఆలోచించి ఇలా కరెన్సీతో అలంకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. పైగా ఇలా ఇంత పెద్ద మొత్తంతో ఓ దేవుడి గుడిని అలంకరించడం దేశంలోనే తొలిసారి అని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు.
ఒక నెల రోజు పాటు 150 మంది కష్టపడి రూపొందించిన ప్రత్యేక అలంకరణ, దాని భద్రత కోసం సీసీ కెమెరాలతో అత్యాధునిక భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆలయ ట్రస్టీ ఒకరు తెలిపారు. ఈ ప్రత్యేకమైన కరెన్సీ అలంకరణ ఒక వారం పాటు ప్రదర్శనకు ఉంటుందన్నారు. గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా సోమవారం కర్ణాటక అంతటా ఆధ్యాత్మిక శోభ నిండింది. దేవుడి ఆశీర్వాదం కోసం భక్తులు పెద్ద వినాయక దేవాలయాలు, గణేష్ మండపాలకు తరలివచ్చారు.
బెంగళూరులో మాంసాహారంపై నిషేధం
గణేష్ నవరాత్రుల సందర్భంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే(BBMP) నగరంలో మాంసం అమ్మకాలు మరియు వధలను నిషేధించింది. ఈ మేరకు జంతు సలహా బోర్డు అన్ని మాంసం దుకాణాల యజమానులకు మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే నగర వ్యాప్తంగా గణేష్ మండపాలను నిర్వహించే వారి కోసం ప్రభుత్వం నిబంధనల జాబితాను కూడా విడుదల చేసింది. అనుమతుల కోసం బెంగళూరులో 60కి పైగా విండో క్లియరెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాల తయారీ, విక్రయాలపై బీబీఎంపీ ఇప్పటికే నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించిన తయారీదారులు, కొనుగోలు దారులకు జరిమానా విధించేందుకు సిద్ధమైంది.
నగరంలోని పలు చోట్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో వీధుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు నిర్వహించాలని బీబీఎంపీ ఆదేశించింది. పర్యావరణహితంగా పండుగ జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ తెలిపింది. విరాళాల పేరుతో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయరాదని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే బ్యానర్లు, ఫ్లెక్సీలపై కఠిన నిషేధం విధించింది. బెంగళూరులో ఇప్పటికే అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లను నిషేధించారు. విగ్రహాల నిమజ్జనం కోసం సాంకీ సరస్సు, హలాసూరు సరస్సు, యెడియూర్ సరస్సు, అగర సరస్సు, హెబ్బల్ సరస్సు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.