(Source: ECI/ABP News/ABP Majha)
భారత్ అన్ని దేశాలనూ కలిపే వారధి లాంటిది, ABP న్యూస్‌తో G20 చీఫ్ కో ఆర్డినేటర్ శ్రింగ్లా
G20 Summit 2023: G20 చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ శ్రింగ్లా ABP న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు ప్రస్తావించారు.
G20 Summit 2023:
హర్షవర్దన్ శ్రింగ్లా ఇంటర్వ్యూ..
ఢిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న G20 సమ్మిట్‌కి (G20 Summit 2023) సర్వం సిద్ధమైంది. పలు దేశాల ప్రతినిధులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంటున్నారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సదస్సులో ఏయేం చర్చించనున్నారో ఇప్పటికే కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ అజెండాపై మరింత స్పష్టతనిచ్చారు G20 చీఫ్ కోఆర్డినేటర్ హర్ష్ వర్ధన్ శ్రింగ్లా (Harsh Vardhan Shringla). ABP News కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. 2020-22 వరకూ విదేశాంగ శాఖ సెక్రటరీగా పని చేశారు హర్షవర్ధన్ శ్రింగ్లా. కొవిడ్ లాంటి విపత్తులు మళ్లీ దాడి చేసినా తట్టుకుని గట్టిగా నిలబడే స్థాయికి ఎలా చేరుకోవాలనే అంశంపైనే సదస్సులో పూర్తి స్థాయిలో చర్చ జరగనున్నట్టు వెల్లడించారు. భారత్ తొలిసారి G20కి అధ్యక్షత వహించడం గొప్ప విషయమే అయినా...ఇది సవాలుతో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలను భారత్ నేతృత్వం వహిస్తోందని, ఇదే సమయంలో అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
"ప్రపంచ దేశాలు ఈ సదస్సుని చాలా గొప్పగా చూస్తున్నారు. భారత్ అధ్యక్షత వహించడమే ఈ సారి ప్రత్యేకత. ఇది కచ్చితంగా ఎన్నో మార్పులకు నాంది పలుకుతుందని విశ్వాసంతో ఉన్నాం. తొలిసారి G20 సదస్సుకి భారత్ నేతృత్వం వహిస్తోంది. ఇది కచ్చితంగా సవాలుతో కూడుకున్నదే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు భారత్ అధ్యక్షత వహించడం గొప్ప విషయమే. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లనూ గుర్తించాలి. ఈ సవాళ్లకు G20 ద్వారా పరిష్కారం కనుగొనాలన్నదే భారత్ లక్ష్యం"
- హర్షవర్ధన్ శ్రింగ్లా, G20 చీఫ్ కోఆర్డినేటర్
హ్యూమ్ సెంట్రిక్ మోడల్..
Human Centric డెవలప్‌మెంట్ మోడల్‌ని ప్రపంచానికి భారత్ పరిచయం చేసిందన్న శ్రింగ్లా...ఆర్థిక, సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధికీ ఇదే విధానాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని చాటి చెప్పాలని వెల్లడించారు. అంతర్జాతీయంగా పలు దేశాలు భౌగోళిక, ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్ ఈ దేశాలన్నింటినీ కలిపి ఈ సదస్సు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుందని స్పష్టం చేశారు. అందుకే...దీనిపై అంచనాలు పెరిగాయని అన్నారు శ్రింగ్లా. అన్ని దేశాలతోనూ చర్చించి ఓ అజెండాని నిర్ణయించుకోడానికి ఇదే మంచి వేదిక అని అభిప్రాయపడ్డారు.
"ఇప్పుడు ఇండియా సరైన పొజిషన్‌లో ఉంది. G7 సమ్మిట్‌కి ప్రతిసారీ భారత్‌కి ఆహ్వానం అందుతోంది. క్వాడ్‌లోనూ ఇండియా ఉంది. BRICS,SCOలోనూ భారత్ సభ్య దేశంగా ఉంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్...ఇలా అన్ని దిక్కుల్లో ఉన్న దేశాలకు భారత్ ఓ బ్రిడ్జ్ లాంటిది. అందుకే...ఇండియా సరైన చోటులో ఉందని అంటున్నాను. వసుధైక కుటుంబం అనే భారత మూల సిద్ధాంతం ఆధారంగా చర్చలు జరగాల్సిన అవసరముంది. ఈ సదస్సు ద్వారా దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాలి. అదే మా లక్ష్యం కూడా. అభివృద్ధి కోసం ఒకరికొకరు సహకరించుకోవాలి"
- హర్షవర్ధన్ శ్రింగ్లా, G20 చీఫ్ కోఆర్డినేటర్
క్రిప్టో కరెన్సీపైనా నియంత్రణ..
క్రిప్టోకరెన్సీ గురించి కూడా ప్రస్తావించారు శ్రింగ్లా. G20 ఆర్థిక మంత్రుల సదస్సులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్సేషన్‌లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరంపై చర్చలు జరిగాయి. ట్యాక్స్ స్ట్రక్చర్‌లో చేయాల్సిన మార్పులపైనా చర్చ జరిగింది. ఇక క్రిప్టో కరెన్సీపైనా పూర్తి స్థాయిలో నియంత్రణ కోసం చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. G20 సదస్సులోనూ దీని గురించి చర్చించి global crypto regulatory frameworkని తీసుకురావాలని భావిస్తోంది భారత్. ఇప్పటికే IMF ఈ అంశంపై పలు ప్రతిపాదనలు చేసింది.
Also Read: G20 Summit 2023: జీ20 సమ్మిట్‌లో పాల్గొనే అందరికీ తలో వెయ్యి రూపాయలు, గవర్నమెంట్ ప్లాన్ భళా!