Chennai Merina Beach: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో ఐదుగురు మృతి, 100మందికి పైగా ఆస్పత్రిపాలు
IAF Air Show: చెన్నై మెరీనా బీచ్‌లో మెగా ఎయిర్ షో ప్రదర్శన సందర్భంగా తీవ్ర విషాదం నెలకొంది. లక్షలాది మంది తరలిరాగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 5కు చేరుకుంది. వందలాది ఆస్పత్రి పాలయ్యారు.
Stampede In Chennai Merina Beach: తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో (Chennai Merina Beach) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'మెగా ఎయిర్ షో'ను (Mega Air Show) చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగియగా.. తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ తీవ్ర రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందగా.. వందలాది మంది గాయపడ్డారు. దాదాపు 230 మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతులు శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్‌గా గుర్తించారు. ఎయిర్ షోకు దాదాపు 10 లక్షల మంది హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. కాగా, దాదాపు 21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఎయిర్ షో నిర్వహించారు.
ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు
బీచ్‌లో మెగా ఎయిర్ షో ప్రదర్శన ముగిసినప్పటికీ లక్షలాది మంది తరలిరావడంతో తిరుగు ప్రయాణంలో ఇబ్బంది నెలకొంది. సాయంత్రం వరకూ ట్రాఫిక్ కొనసాగింది. చాలామంది సొమ్మసిల్లి పడిపోగా.. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు సైతం ఇబ్బంది ఏర్పడింది. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలిరావడంతో.. మెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. షో ముగిసిన అనంతరం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడంతో ప్లాట్ ఫాంలపై నిలబడేందుకు సైతం వీల్లేని పరిస్థితి నెలకొంది. ఎయిర్ షోపై భారీగా జనం వస్తారని తెలిసినా.. అందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వందే బాధ్యత
చెన్నైలో జరిగిన ప్రమాదంపై రాజకీయ రగడ మొదలైంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎయిర్ షోకు వచ్చిన ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా డీఎంకే ప్రభుత్వం కల్పించలేదని విరుచుకుపడ్డారు. ఎయిర్ షోకు తగినంత భద్రత కల్పించామని ప్రభుత్వం చెబుతోంది. 7500మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించామని మెరినా బీచ్ వద్ద 40 అంబులెన్సులను అందుబాటులో ఉంచామని తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు.
Also Read: Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం