విడిపోవాలనుకునే వారిని బలవంతంగా కలిపి ఉంచడం ప్రమాదకరం, విడాకులపై కోర్టు కీలక వ్యాఖ్యలు
Allahabad High Court: విడిపోవాలనుకునే జంటని బలవంతంగా కలిపి ఉంచలేమని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది.
Allahabad High Court:
విడాకులపై అలహాబాద్ హైకోర్టు..
అలహాబాద్ హైకోర్టు విడాకులపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకి విడాకులు మంజూరు చేసింది. విడిపోవాలి అనుకున్న వాళ్లను బలవంతంగా కలపడం క్రూరత్వమే అనిపించుకుంటుందని తేల్చి చెప్పింది. ఇష్టాఇష్టాలేంటో తెలుసుకోకుండా పక్షపాతంగా వ్యవహరించి చట్టపరంగా వాళ్లను కలపాలని చూడడం సరికాదని, వివాహ బంధానికి అర్థమే లేకుండా పోతుందని స్పష్టం చేసింది. తనకు, భార్యకి విడాకులు ఇవ్వాలని ఓ వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. అయితే...దిగువ కోర్టు అందుకు అంగీకరించలేదు. దీనిపై హైకోర్టుకి వెళ్లాడు పిటిషనర్. ఈ పిటిషన్ విచారణ సమయంలోనే అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారని, కలిసి ఉండకపోవడానికి ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారని వెల్లడించింది కోర్టు. దాదాపు పదేళ్లుగా విడిగా ఉంటున్నారని చెప్పిన న్యాయస్థానం చివరకు విడాకులు మంజూరు చేసింది. 2019 నవంబర్ 7వ తేదీన ఘజియాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్పీల్ చేసుకున్నాడు భర్త. అప్పటి నుంచే ఇది కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. చివరకు ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ని తిరస్కరించింది.
"ఈ జంట దాదాపు పదేళ్లుగా విడిగా ఉంటోంది. విడిగా ఉండడానికి ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. భర్తపై భార్య క్రిమినల్ కంప్లెయింట్స్ ఇచ్చింది. చాలా విధాలుగా అతడిని ఇబ్బంది పెట్టాలని చూసింది. ఇద్దరిలో ఏ ఒక్కరికీ కలిసుండాలన్న ఆలోచన లేదు. అలాంటప్పుడు వాళ్లను బలవంతంగా కలిపి ఉంచడం చాలా ప్రమాదకరం. పైగా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకి విడాకులివ్వకుండా కలిపి ఉంచడం వాళ్లకే హానికరం"
- అలహాబాద్ హైకోర్టు
సప్తపది వేడుక, ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని అలబహాబాద్ హైకోర్టు ఇటీవలే వ్యాఖ్యానించింది. తన నుంచి విడిపోయిన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ వివాహం చేసుకుందని ఆరోపించిన ఒక వ్యక్తి పిటిషన్‌ను తిరష్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాను రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆరోపిస్తూ భర్త ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటీషన్‌ను భార్య అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్.. ‘వివాహానికి సంబంధించి సరైన వేడుకలు, సరైన ఆచారాలతో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం. సంప్రదాయాలు, ఆచారాలను పాటించి వివాహం జరుపుకోకపోతే లేదా నిర్వహించకపోతే అది పెళ్లి అని చెప్పలేం’ అని వ్యాఖ్యానించారు. వివాహానికి సంబంధించి ఖచ్చితంగా చేయాల్సిన క్రతువుల్లో సప్తపది ఒకటని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, సాంప్రదాయాలు లేకుండా వివాహం జరిగితే అది శాష్త్రీయంగా జరిగిందని భావించలేమని చట్టం దృష్టిలో అది వివాహం కాదన్నారు. వివాహం చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే, పార్టీలకు వర్తించే చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో అది వివాహం కాదని అభిప్రాయపడింది. హిందూ చట్టం ప్రకారం పెళ్లిలో 'సప్తపది' కృతువు పెళ్లి చెల్లుబాటు అయ్యే వాటిలో ఒకటి అని పేర్కొంది.
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - డీఏ పెంచుతూ నిర్ణయం