PMGKAY News: ఏడాది పాటు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు, కేంద్రం కీలక ప్రకటన
Garib Kalyan Yojana: గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా ఏడాదిగా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Garib Kalyan Yojana:
గరీబ్ కల్యాణ్ యోజన..
Garib Kalyan Yojana News:కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. Prime Minister Garib Kalyan Yojana (PMGKAY) పథకం కింద ఏడాది పాటు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకంపైనే కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుందని వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నిమయావళిని ఉల్లంఘించి మరీ ప్రధాని ఈ పథకం గురించి ప్రస్తావించారని మండి పడింది. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ప్రకటన చేయడం (food ministry) ఆసక్తికరంగా మారింది.
"అంత్యోదయ అన్నయోజనలో భాగమైన కుటుంబాలతో పాటు మరి కొన్ని కుటుంబాలకూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఏడాది నుంచి ఆహార ధాన్యాలు అందిస్తున్నాం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకం అమలవుతోంది"
- కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ
ఆహార భద్రత కోసమే..
2020లో ఈ గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌లో (National Food Security Act) భాగంగా అందరికీ ఆహార భద్రత అందించాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది కేంద్రం. అదనపు ఆహార ధాన్యాలు ఇచ్చేలా మార్పులు చేసింది. NFSA ప్రకారం...గ్రామాల్లోని 75% మందికి, పట్టణాల్లోని 50% మందికి ఈ ఆహార ధాన్యాలు అందుతున్నాయి. నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తారు. ప్రియారిటీ హౌజ్‌హోల్డ్స్ (priority households) లబ్ధిదారుల్లోని కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ధాన్యాలు అందిస్తోంది కేంద్రం. పేదలపై భారాన్ని తగ్గించేందుకు ఈ పథకం తీసుకొచ్చామని ప్రకటించింది.